సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పోలవరం, అమరావతి సందర్శన యాత్రల పేరుతో కోట్లు ఖర్చుపెడుతూ చంద్రబాబు మతి, గతీ లేనట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీని ఎలాగైనా దెబ్బకొట్టాలని బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆ క్రమంలోనే జీరోగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేనని అన్నారు. విద్యా, వ్యవసాయం, సంక్షేమం, బెల్ట్‌షాప్‌లు తొలగించడం వంటి మేనిఫెస్టోతో బీజేపీ ప్రచారంలోకి రాబోతోందని వివరించారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవడం గంటాకు అలవాటని చురకలంటించారు.
ఏ పార్టీ మారతారో చూడాలి..
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న విష్ణుకుమార్‌రాజు మంత్రి గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక కుంభకోణాలు, దోపిడీలు చేసింది శ్రీనివాసరావేనని ఆరోపించారు. గంటా చరిత్ర చూస్తే.. అధికారం మారినప్పుడల్లా పార్టీ మారే వ్యక్తి అని విమర్శించారు. ‘25వ తేదీ వరకు సమయం ఉంది. గంటా మళ్లీ ఏ పార్టీ మారతారో చూడాలి. విశాఖ నార్త్‌లో పోటీ రెండు పార్టీల మధ్య కాదు. నీతి, నిజాయితీకి, అవినీతి పరుడైన గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో పరిపాలనపై కంట్రోల్ పోయిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment