
సాక్షి, అమరావతి: ‘‘గత నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం బయటినుంచి రూ.లక్షన్నర కోట్లు అప్పు తెచ్చింది. ఇదిగాక 14వ ఆర్థిక సంఘం ఐదేళ్లలో రాష్ట్రానికి రెండున్నర లక్షలకోట్ల కేంద్ర సాయాన్ని సిఫార్సు చేస్తే అందులో రూ.2 లక్షలకోట్ల నిధులు ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికందాయి. ఇవిగాక ఇతరత్రా నిధులతో కలపి మొత్తం రూ.4 లక్షల కోట్ల డబ్బులు రాగా అవన్నీ ఎక్కడికి పోయాయి? హైదరాబాద్‌ను నేనే కట్టేశానని చెప్పుకుంటారే.. రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు వచ్చినా రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? ఈ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి?’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సీఎం చంద్రబాబును నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్రప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్‌తో ‘రాష్ట్రప్రభుత్వ అవినీతి దాహానికి బలైన బాధితుల తరఫున ధర్మపోరాట దీక్ష’ పేరుతో బీజేపీ సోమవారం నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడలో జరిగిన ధర్నాలో రాంమాధవ్ మాట్లాడారు. ఆయా పథకాలకు ‘చంద్రన్న’ అని పేరు పెట్టుకున్నా, వాటికీ నిధులిస్తోంది కేంద్రమేనన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ.. కేంద్రంపైనే విమర్శలు చేస్తూ.. ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే, మేం చెప్పబోమనే నియంతృత్వ పోకడలతో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.‘మమ్మల్ని ప్రశ్నిస్తే ఏపీని ప్రశ్నించినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ అంటే టీడీపీ ఒక్కటే కాదు, ఏపీ అంటే ఈ రాష్ట్రంలోని కోటానుకోట్ల ప్రజలు. అనేక పార్టీలు, సంస్థలు కలిపే ఏపీ అవుతుంది. మనందరికీ ఏపీ అభివృద్ధి పట్ల నిబద్ధత ఉంది’ అని అన్నారు.
బాధితుల పొట్టకొట్టి ప్రభుత్వమే కుంభకోణానికి యత్నం
‘అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి రూ.6,500 కోట్లు బాధితులకు దక్కేలా చేయడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద కష్టం కాకూడదు. కానీ భూకబ్జాదారులకు అండగా నిలబడే ప్రభుత్వమిది. అందుకే అగ్రిగోల్డ్ భూములపై కన్నేసి, లక్షలాది కుటుంబాల పొట్టలు కొట్టి, ఆ భూములు కబ్జా చేసే కుతంత్రానికి, కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతోంది’ అని రాంమాధవ్ ధ్వజమెత్తారు. ఇంతకుమించిన ప్రజాద్రోహం మరొకటి ఉండబోదన్నారు. తెలుగు దోపిడీ పార్టీ బాధితులైన లక్షలాది కుటుంబాలకు న్యాయం చేకూర్చడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తొందరలోనే మారబోతోందని, అప్పుడు మొదటగా అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిర్ణయం జరుగుతుందని చెప్పారు. అగ్రిగోల్డ్ వ్యవహారం పైకి కనబడుతున్న చిన్న కుంభకోణమని.. ఈ రాష్ట్రప్రభుత్వం నిలువెల్లా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. తామేమి చేస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదన్న తీరున రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని తప్పుపట్టారు.ఇది హిట్లర్ తరహా పాలనే’’ అని దుయ్యబట్టారు. రాష్ట్రప్రజల ఆశలను ఇక్కడి ప్రభుత్వం వమ్ము చేసిందని, అవినీతి, కుటుంబ పాలన, హిట్లర్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎక్కువ రోజులు కొనసాగే అధికారం లేదన్నారు.
కక్షసాధింపు చర్యలైతే రమేష్ కంటే పెద్ద నాయకులే ఉన్నారుగా..
కేంద్రంపై అపనిందలు వేయడం, అర్థరహితమైన డిమాండ్లు.. ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వ అవినీతి రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత మూడేళ్లలో దేశంలోకెల్లా ఏపీకే కేంద్రం నుంచి అత్యధిక నిధులొచ్చాయని స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు గోబెల్స్‌లని, ఇలాంటి ఎందరో గోబెల్స్‌కు బాస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఇలాంటి ఆంబోతులతో కేంద్రంపైనా, మోదీపైనా, బీజేపీపైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ‘‘కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే సీఎం రమేష్‌పై దాడులు ఎందుకు? ఆయనకన్నా పెద్ద నాయకులే ఉన్నారు. వారిపై అవినీతి ఆరోపణలున్నాయి. కక్షసాధింపు బీజేపీ పద్ధతి కాదు.. చట్టప్రకారం అవినీతిపరులను జైలుకు పంపేవరకు కేంద్ర ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఇప్పుడున్నవారు దాన్ని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని, తెలంగాణలో కాంగ్రెస్ చంకలో కూర్చొని, ఏపీలో దాన్ని భుజాన ఎత్తుకొని రాజకీయాలు చేస్తున్నారని రాంమాధవ్ విమర్శించారు. ప్రజల ముందుకెళ్లి టీడీపీ నిజస్వరూపాన్ని తెలియజెప్పి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకుని బీజేపీ పనిచేస్తుందన్నారు. మోదీని నేను ఆపేస్తానంటూ ఈ రాష్ట్ర నాయకులు పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, మోదీని ఆపే శక్తి వారికి లేదని.. ఆరునెలల తర్వాత వారే ఆగిపోబోతున్నారని రాంమాధవ్ అన్నారు.
రాష్ట్రంలో ‘లాలూ’చీ పాలన: జీవీఎల్
అమరావతి నిర్మాణం పేరుతో పేదల భూములు కబ్జా చేసినట్టే.. అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ పేదల డబ్బులనూ తినేద్దామని టీడీపీ పెద్దలు చూస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలకు పాలనకంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువని, మాయచేసి కాంట్రాక్టులు కొట్టేస్తున్నారన్నారు. ఏపీలో ‘లాలూ’చీ పాలన నడుస్తోందని, లాలూప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మళ్లీ ఎలాగూ గెలవమనే ఆఖరి ఆరునెలల్లో మరింత సర్దుకుందామని లూటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ బినామీదారులే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్టు నటిస్తూ, మరో చేత్తో లూటీ చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు కొట్టేసి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, దీనిపై కేంద్రం విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా, మంత్రాలయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ రాజు సోమవారం ఆత్మహత్య చేసుకోవడంతో అతని మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు, పలువురు రాష్ట్ర పార్టీ నేతలు పాల్గొన్నారు.
హాయ్‌ల్యాండ్‌ను లోకేష్ కొట్టేయాలనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం: కన్నా
సీఎం తనయుడు లోకేష్ హాయ్‌ల్యాండ్‌ను అతి తక్కువ ధరకు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే తొలుత అగ్రిగోల్డ్ సంస్థపై అభాండాలేసి.. దాన్ని నిర్వీర్యంచేసి, 35 లక్షల బాధితుల కుటుంబాలను రోడ్డున పడేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసినప్పటి నుంచి ఏటా వాటి విలువను తగ్గించి చూపుతోందన్నారు. ‘2015లో ఈ ఆస్తుల విలువ రూ.25 వేల కోట్లని చెప్పారు. 2016లో రూ.16 వేల కోట్లన్నారు.. 2017లో రూ.10 వేల కోట్లన్నారు. 2018లో రూ.2,200 కోట్లు అంటున్నారు. బయట వీరి ఆస్తుల విలువలు పెరుగుతుంటే.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తగ్గించి చూపిస్తూ వస్తున్నారు. అగ్రిగోల్డ్ పేరిట రూ.570 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించి, ఆస్తుల ఆటాచ్‌మెంట్ సమయానికి కేవలం రూ.ఆరు లక్షలే ఉన్నాయని చూపించారు’ అని దుయ్యబట్టారు. రూ.3వేల కోట్ల విలువుండే హాయ్‌ల్యాండ్‌ను రూ.275 కోట్లకే కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, అగ్రిగోల్డ్ యజమాన్యం బాధితులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. వారికి న్యాయం జరిగేదాకా బీజేపీ అండగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment