సాక్షి, హైదరాబాద్ : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పరిపూర్ణానంద స్వామిపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం ‘ఛలో ప్రగతిభవన్’కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులను పోలీసులు వారి నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చలో ప్రగతిభవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన బీజేపీ శాసనపక్ష నేత కిషన్‌రెడ్డిని పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి కిషన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అసెంబ్లీ వైపు వెళ్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డిని అసెంబ్లీ గేటు ముందు అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment