సాక్షి, బెంగళూరు: కుమారస్వామి సర్కారు బలపరీక్షపై చర్చ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నకిలీ స్వలింగసంపర్కుల సెక్స్ వీడియోతో తన పరువు తీశారంటూ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అరవింద లింబావళి కన్నీటి పర్యంతమయ్యారు.
సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ... సోషల్ మీడియాతో ఇద్దరు వ్యక్తులు ముద్దులు పెట్టుకునే వీడియో పెట్టడం ద్వారా అందులో తాను ఉన్నానని, దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ చేసి తమను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కుట్రలో అధికార పార్టీతో పాటు సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వివరణ ఇస్తానన్నారు. కుట్రలు వీడి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని ఆయన సూచించారు. మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. లింబావళి అవమానకరంగా ప్రవర్తించారని జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడ ఆరోపించారు. దీనిపై లింబావళి స్పందిస్తూ.. ‘నకిలీ వీడియో కారణంగా నేను ఎంతో క్షోభ అనుభవించాను. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే మా కుటుంబం పడే బాధ అప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో కారణంగా మా పిల్లలు ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు మాత్రమే తెలుసు’ అంటు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనను స్పీకర్ రమేశ్‌కుమార్ సముదాయించారు.
కాగా, ఈ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ లింబావళి మద్దతుదారులు వేర్వేరుగా రెండు ఫిర్యాదులు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: ఒక్కరోజు ఆగితే తిరుగులేదు)
Comments
Please login to add a commentAdd a comment