సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టులకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం నుంచి బిల్లలు అందకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడవకముందే రాష్ట్రంలో మరో వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని చనిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని రాంనగర్ జిల్లాలో పార్క్ చేసిన కారులో గుర్తించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడిని బెంగుళూరులోని అమలిపురకు చెందిన బిజినెస్ మెన్ ప్రదీప్‌గా(47) గుర్తించారు.
మృతుడి వద్ద ఎనిమిది పేజీల సుసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందులో తన చావుకు బీజేపీ ఎమ్మెల్యేసహా ఆరుగురు కారణమని రాసినట్లు వెల్లడించారు. మహదేవపుర బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద్ లింబావలి, ఈ రమేష్, కే గోపి, డాక్టర్ జయరాం రెడ్డి, రాఘవ్ భట్, సోమయ్య పేర్లు సుసైడ్ లేఖలో పేర్కొన్నాడు. తన చావుకు ఈ ఆరుగురే బాధ్యులని ఆరోపిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నోట్‌లో పోలీసులను కోరాడు. అంతేగాక వారి మొబైల్ నంబర్లను కూడా ఇందులో పేర్కొన్నాడు
ఆదివారం న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు ప్రదీప్ బెంగుళూరు సమీపంలోని రామ్‌నగర్‌లోని రిసార్ట్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రిసార్టు నుంచి బెంగళూరులోని నివాసానికి తిరిగి వచ్చిన తర్వాత కారులో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేతోపాటు అయిదుగురు తనను మానసికంగా హింసించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు నోట్‌లో పేర్కొన్నాడని తెలిపారు. సుసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
పోలీసులు వివరాల ప్రకారం.. 2018లో బెంగళూరులోని తన భాగస్వాములతో కలిసి ఓ క్లబ్‌లో ప్రదీప్ రూ.1.8 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్‌లో పనిచేసినందుకు ప్రతి నెలా రూ. లక్షా 50 వేలతోపాటు రూ.3 లక్షలు తిరిగి ఇస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, చాలా కాలంగా డబ్బు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. తన పెట్టుబడి తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. దాంతో ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే వారిని పిలిపించి మాట్లాడగా.. రూ.90 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇంతవరకు తనకు డబ్బులు ఇవ్వకపోగా ఎమ్మెల్యే వారికి మద్దతు ఇస్తున్నాడు. ఎమ్మెల్యే అండ చూసుకొని తనను మానసికంగా వేధించారని లేఖలో పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా సుసైడ్ నోట్‌లో తన పేరును ప్రస్తావించడంపై ఎమ్మెల్యే లింబావలి స్పందించారు. ‘సుసైడ్ నోట్‌లో నా పేరు ఉందని తెలిసింది. 2010 నుంచి 2013 వరకు ప్రదీప్ నా సోషల్ మీడియా అకౌంట్లు చూసుకునేవాడు. తన వ్యాపారంలో ఏదో వివాదం ఏర్పడిందని నా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారికి సూచించాను. వ్యాపారంలో ప్రదీప్ ఎంత పెట్టుబడి పెట్టాడో నేను అడగలేదు. అతనికి పార్టనర్స్ ఎంత చెల్లించాలో కూడా నేను చెప్పలేదు. తర్వాత ప్రదీపే వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో, నోట్‌లో నా పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment