Arvind Limbavali
-
Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ స్థానం ఆయనకే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చోటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్‌లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 212 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది. చివరి విడతలో భాగంగా పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగ్థాన్, సేదన్, కొప్పల్, రోణ్, హుబ్లీ ధర్వాడ్ సెంట్రల్, హగరిబొమ్మనహళ్లి, హెబ్బాల్, గోవిందరాజ్ నగర్, మహదేవపుర, కృష్ణరాజ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పోటీ చేయాలనుకున్న హుబ్బళి సెంట్రల్ నియోజవర్గం నుంచి బీజేపీ జనరల్ సెక్రటరీ మహేష్ తెంగినాకైకి చోటు కల్పించింది. కాగా హుబ్బలి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ శెట్టర్.. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాషాయ దళాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మహదేవపుర సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ లింబావలికి బీజేపీ హ్యండిచ్చింది. ఈ స్థానంలో ఆయన సతీమణి మంజులా పోటీలోకి దింపింది.. కొప్పల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని బెదిరిస్తున్న కారడి సంగన్న అమరప్పకు కూడా పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమార్తె మంజుల అమరేష్‌కు కొప్పల్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా..రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చివరి విడత విడుదల చేసింది. ఇక మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. -
బెంగళూరులో వ్యాపారి ఆత్మహత్య.. సుసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే పేరు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టులకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం నుంచి బిల్లలు అందకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడవకముందే రాష్ట్రంలో మరో వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని చనిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని రాంనగర్ జిల్లాలో పార్క్ చేసిన కారులో గుర్తించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడిని బెంగుళూరులోని అమలిపురకు చెందిన బిజినెస్ మెన్ ప్రదీప్‌గా(47) గుర్తించారు. మృతుడి వద్ద ఎనిమిది పేజీల సుసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందులో తన చావుకు బీజేపీ ఎమ్మెల్యేసహా ఆరుగురు కారణమని రాసినట్లు వెల్లడించారు. మహదేవపుర బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద్ లింబావలి, ఈ రమేష్, కే గోపి, డాక్టర్ జయరాం రెడ్డి, రాఘవ్ భట్, సోమయ్య పేర్లు సుసైడ్ లేఖలో పేర్కొన్నాడు. తన చావుకు ఈ ఆరుగురే బాధ్యులని ఆరోపిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నోట్లో పోలీసులను కోరాడు. అంతేగాక వారి మొబైల్ నంబర్లను కూడా ఇందులో పేర్కొన్నాడు ఆదివారం న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు ప్రదీప్ బెంగుళూరు సమీపంలోని రామ్‌నగర్‌లోని రిసార్ట్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రిసార్టు నుంచి బెంగళూరులోని నివాసానికి తిరిగి వచ్చిన తర్వాత కారులో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేతోపాటు అయిదుగురు తనను మానసికంగా హింసించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు నోట్లో పేర్కొన్నాడని తెలిపారు. సుసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కూతురు.. పోలీసులు వివరాల ప్రకారం.. 2018లో బెంగళూరులోని తన భాగస్వాములతో కలిసి ఓ క్లబ్లో ప్రదీప్ రూ.1.8 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్లో పనిచేసినందుకు ప్రతి నెలా రూ. లక్షా 50 వేలతోపాటు రూ.3 లక్షలు తిరిగి ఇస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, చాలా కాలంగా డబ్బు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. తన పెట్టుబడి తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. దాంతో ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే వారిని పిలిపించి మాట్లాడగా.. రూ.90 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇంతవరకు తనకు డబ్బులు ఇవ్వకపోగా ఎమ్మెల్యే వారికి మద్దతు ఇస్తున్నాడు. ఎమ్మెల్యే అండ చూసుకొని తనను మానసికంగా వేధించారని లేఖలో పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సుసైడ్ నోట్లో తన పేరును ప్రస్తావించడంపై ఎమ్మెల్యే లింబావలి స్పందించారు. ‘సుసైడ్ నోట్లో నా పేరు ఉందని తెలిసింది. 2010 నుంచి 2013 వరకు ప్రదీప్ నా సోషల్ మీడియా అకౌంట్లు చూసుకునేవాడు. తన వ్యాపారంలో ఏదో వివాదం ఏర్పడిందని నా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారికి సూచించాను. వ్యాపారంలో ప్రదీప్ ఎంత పెట్టుబడి పెట్టాడో నేను అడగలేదు. అతనికి పార్టనర్స్ ఎంత చెల్లించాలో కూడా నేను చెప్పలేదు. తర్వాత ప్రదీపే వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో, నోట్లో నా పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. -
అసెంబ్లీలో ‘గే’ వీడియో; ఎమ్మెల్యే కన్నీళ్లు
సాక్షి, బెంగళూరు: కుమారస్వామి సర్కారు బలపరీక్షపై చర్చ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నకిలీ స్వలింగసంపర్కుల సెక్స్ వీడియోతో తన పరువు తీశారంటూ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అరవింద లింబావళి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ... సోషల్ మీడియాతో ఇద్దరు వ్యక్తులు ముద్దులు పెట్టుకునే వీడియో పెట్టడం ద్వారా అందులో తాను ఉన్నానని, దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ చేసి తమను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కుట్రలో అధికార పార్టీతో పాటు సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వివరణ ఇస్తానన్నారు. కుట్రలు వీడి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని ఆయన సూచించారు. మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. లింబావళి అవమానకరంగా ప్రవర్తించారని జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడ ఆరోపించారు. దీనిపై లింబావళి స్పందిస్తూ.. ‘నకిలీ వీడియో కారణంగా నేను ఎంతో క్షోభ అనుభవించాను. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే మా కుటుంబం పడే బాధ అప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో కారణంగా మా పిల్లలు ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు మాత్రమే తెలుసు’ అంటు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనను స్పీకర్ రమేశ్‌కుమార్ సముదాయించారు. కాగా, ఈ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ లింబావళి మద్దతుదారులు వేర్వేరుగా రెండు ఫిర్యాదులు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: ఒక్కరోజు ఆగితే తిరుగులేదు) -
సీఎం పేరు ‘జై శ్రీరామ్’ అన్నా ఆశ్చర్యమేమీ లేదు!
సాక్షి, బెంగళూరు: ఓ వైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా మరోవైపు హిందుత్వ అజెండా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నేత అరవింద్ లింబావలి సీఎం సిద్ధారామయ్యపై ఓ సెటైర్ పేల్చారు. అసలేమైందంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో ముందుగా మీ రాష్ట్రంలో ఆకలి చావుల గురించి పట్టించుకుంటే మంచిదని సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంతో పాటుగా కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ పర్యటనకు ముందురోజు హిందుత్వ అజెండాపై పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేత అరవింద్ లింబావలి ఘాటుగా స్పందించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి కర్ణాటక పర్యటనకు వస్తారన్న ముందురోజు మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందుత్వ అజెండా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యోగి రెండోసారి కర్ణాటకలో పర్యటించినప్పుడు సిద్ధరామయ్య తన పేరులో రామ్, సిద్ధా అని ఉందని పేర్కొన్నట్లు గుర్తుచేశారు. యోగి మరోసారి కర్ణాటకలో పర్యటిస్తే సిద్ధరామయ్య తనపేరును జై శ్రీరామ్ అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల కర్ణాటక పర్యటనల నేపథ్యంలోనే సిద్ధరామయ్య హిందుత్వ పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. కాగా, యూపీలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని.. కర్ణాటకలోని రేషన్ షాపులను, ఇందిరా క్యాంటీన్లను సందర్శించి ఆదర్శంగా తీసుకోండంటూ సిద్ధరామయ్య యోగికి ఓ సలహా ఇవ్వగా, ఆదిత్యానాథ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ‘మీ (కాంగ్రెస్) హయాంలోనే కర్ణాటకలో రైతుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని విన్నాను. నిజాయితీ పరులైన అధికారుల బదిలీలు, వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమవుతుందంట కదా’ అంటూ యోగి కౌంటర్ ఇచ్చారు. తాజాగా బీజేపీ నేత అరవింద్ లింబావలి సీఎం సిద్ధరామయ్య తీరును తప్పుపట్టారు.