
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చోటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్‌లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 212 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది.
చివరి విడతలో భాగంగా పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగ్‌థాన్, సేదన్, కొప్పల్, రోణ్, హుబ్లీ ధర్వాడ్ సెంట్రల్, హగరిబొమ్మనహళ్లి, హెబ్బాల్, గోవిందరాజ్ నగర్, మహదేవపుర, కృష్ణరాజ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పోటీ చేయాలనుకున్న హుబ్బళి సెంట్రల్ నియోజవర్గం నుంచి బీజేపీ జనరల్ సెక్రటరీ మహేష్ తెంగినాకైకి చోటు కల్పించింది.
కాగా హుబ్బలి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ శెట్టర్.. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాషాయ దళాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మహదేవపుర సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ లింబావలికి బీజేపీ హ్యండిచ్చింది. ఈ స్థానంలో ఆయన సతీమణి మంజులా పోటీలోకి దింపింది.. కొప్పల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని బెదిరిస్తున్న కారడి సంగన్న అమరప్పకు కూడా పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమార్తె మంజుల అమరేష్‌కు కొప్పల్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఛాన్స్ ఇచ్చింది.
కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా..రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చివరి విడత విడుదల చేసింది. ఇక మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.