
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ సీనియర్లు, సిట్టింగులను కాదని కొత్త ముఖాలకు బరిలోకి దింపింది. ఈ క్రమంలో సీనియర్లు కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. ఆ పార్టీకి గుడ్ బై చెపారు. ఇక, ఆయన రాజీనామా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు.
ఈ సందర్భంగా సీఎం బొమ్మై మాట్లాడుతూ.. మా పార్టీ హైకమాండ్ జగదీష్ షెట్టర్‌కు ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. షెట్టర్ కర్నాటకలో సీనియర్ నాయకుడు, కీలక నేత. అందుకే ఆయనకు పెద్ద పదవి ఇస్తామని జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మేము మూడో జాబితాపై చర్చించాము. మా సిఫార్సులను పార్లమెంటరీ బోర్డుకు పంపించాము. అభ్యర్థులను వారే ఖరారు చేస్తారు. ఈ సందర్బంగా జగదీష్ షెట్టర్‌కు సీటుపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక, అంతకు ముందు.. బీజేపీ పెద్దలు మాజీ సీఎం షెట్టర్‌ను కలిసి గవర్నర్ లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను షెట్టర్ తిరస్కరించారు. తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నానని, పెద్ద పదవిపై ఆశ లేదని అన్నారు.
ఇక, నాటకీయ పరిణామాల మధ్య జగదీష్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షెట్టర్.. కర్నాటకలోని కొందరు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంత మంది తమ స్వలాభం కోసం పార్టీని తప్పుగా నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై తప్పుగా నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, తాను కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు.
#KarnatakaElections2023| "We have discussed the third list, shortly it is going to come out. We've sent our recommendations to Parliamentary board & they will take a call...we've not discussed about Jagadish Shettar", says Karnataka CM Basavaraj Bommai after the BJP meeting over… pic.twitter.com/1GSjZnRFob
— ANI (@ANI) April 16, 2023