సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి రగడ తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తన సొంత నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. ఈ పార్టీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరారు. బెంగుళూరు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ శెట్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు రావడం వెనక బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌యే కారణమని ధ్వజమెత్తారు.
బీఎల్ సంతోష్‌కు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని శెట్టర్ విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ రాకుండా చేసి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బొమ్మై కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. తన స్థానంలో మహేష్ తెంగినాకైకు టికెట్ ఇవ్వడం కోసం బీఎల్ సంతోష్ తన మీద కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలా చేశారని ధ్వజమెత్తారు.
చదవండి: Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?
అదే విధంగా మైసూరు జిల్లా కృష్ణరాజ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్‌ఎ రామదాస్‌ను కాదని కొత్త ముఖమైన శ్రీవాత్సకు బీజేపీ టికెట్ ఇచ్చారు. దీనిపై కూడా శెట్టర్ ఘాటుగా స్పందించారు. ‘రామదాస్ పరిస్థితి ఏమైందో చూడండి.. బీఎల్ సంతోష్ విధేయుడు కాదనే కారణంతో ఆయన్ను పక్కకు పెట్టేశారు. తన మాట వినే శ్రీవాస్తకు టిక్కెట్ ఇచ్చారు’ అని దుయ్యబట్టారు.
బీఎల్ సంతోష్ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నిమమించిన విఫలమయ్యారని శెట్టర్ విమర్శించారు. అయినా బీజేపీ అగ్ర నాయకులు ఆయన్ను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. సంతోష్‌కు పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యమని, ఇది బీజేపీ పరువును దిగజార్చుతుందని అన్నారు.
‘బీఎల్ సంతోష్‌ను కేరళ ఇన్‌ఛార్జ్‌గా నియమించినా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా చేసినా కొన్ని సీట్లు మాత్రమే గెలిచింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన వ్యక్తి పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ(ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా) స్థానంలో ఉన్న వారికి సలహాలు ఇస్తున్నాడు.’ అని శెట్టర్ దుయ్యబట్టారు.
కాగా గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ నుంచి టిక్కెట్ దక్కలేదు. ఈసారి శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినాకైను హుబ్లి-ధార్వాడ్ స్థానం నుంచి బరిలో దింపింది. దీంతో బీజేపీకి గుడ్‌బై చెప్పి.. అదే హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిద్దరిలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే.
చదవండి: బీజేపీ మూడో జాబితా విడుదల..
Comments
Please login to add a commentAdd a comment