
బెంగళూరు: ‘అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య లింగాయత్ సీఎంలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టర్ సమర్ధించారు. సిద్దరామయ్య కేవలం సీఎం బసవరాజ్ బొమ్మైను ఉద్ధేశించి మాట్లాడారని.. అందరు లింగాయత్ సీఎంల గురించి కాదని పేర్కొన్నారు. బొమ్మై మాత్రమే అవినీతిపరుడని అన్నారని, లింగాయత్‌లు మొత్తం అవినీతిపరులని అనలేదని తెలిపారు.
షెట్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా మంది లింగాయత్ నాయకులు బీజేపీని విడిచిపెట్టారని తెలిపారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అంటే ఆ ప్రాంత ప్రజలను తక్కువ చూడటమేనని.. ఇది బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు తెలివైన వారని, బీజేపీకి ఓటు వేయకుండా తగిన బుద్ది చెప్పాలని కోరారు.
కాగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేయాలని బీజేపీ ఆలోచిస్తుందంటూ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సిద్ధరామయ్య మాట్లాడుతూ..ఇప్పటికే లింగాయత్ ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆయనే మూలం’ అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య కూడా వివరణ ఇచ్చారు. తాను లింగాయత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదని, కేవలం సీఎం బసవరాజ్ బొమ్మైని మాత్రమే విమర్శించానని చెప్పుకొచ్చారు.
చదవండి: కేరళకు తొలి వందేభారత్.. ప్రారంభించిన ప్రధాని మోదీ
కాగా బీజేపీ నేత అయిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినకాయ్‌ను బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ తరపున వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో హుబ్లీ-ధార్వాడ్-సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల వ్యవధిలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ప్రముఖ లింగాయత్ లీడర్లలో శెట్టర్ రెండో సీనియర్ నేత. అతనికంటే ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం, లక్ష్మణ్ సవేదీ హస్తం గూటికి చేరారు. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.
చదవండి: Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
Comments
Please login to add a commentAdd a comment