BJP releases 2nd list of 23 candidates for Karnataka polls; see full list - Sakshi
Sakshi News home page

Karnataka: 23 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. ఏడుగురికి నో ఛాన్స్‌

Published Thu, Apr 13 2023 9:07 AM | Last Updated on Thu, Apr 20 2023 5:23 PM

BJP Releases 2nd List of 23 Candidates For Karnataka Polls Se Full List - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కాషాయదళంలో అసంతృప్తి రగడ మొదలైంది. బుధవారం విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్‌ లభిస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు ఎదురవ్వడంతో రాత్రికి రాత్రి పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు  గుడ్‌బై చెప్పడం, వంటివి చేస్తున్నారు.

తాజాగా 23 మంది అభ్యర్థులతో బీజేపీ తన రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో ఏడుగురికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ దక్కలేదు. 23 మందిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి అశ్విని సంపంగి పోటీ చేయనున్నారు. అభ్యర్థుల జాబితాను రెండు ఫేజ్‌లలో విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం బసవరాజ్‌ బొమ్మె పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 189 అభ్యర్థులతో బుధవారం మొదటి జాబితాను విడుదల చేయగా ప్రస్తుతం 23 మందిని ప్రకటించింది. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో మూడో జాబితా కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.

నో ఛాన్స్‌
కాగా రెండో జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ పెట్టర్‌ పేరు లేదు. హుబ్బలి నుంచి ఆరుస​ఆర్లు గెలుపొందిన జగదీష్‌..ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆయన పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు. షెట్టర్‌కు చివరి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒవేళ తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

వారికి నిరాశ
వరుణలో కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న వి సోమన్న.. గుబ్బి స్థానం తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. అయితే బీజేపీ అందుకు అంగీకరించలేదు. గుబ్బి నియోజకవర్గం నుంచి ఎస్‌డి దిలీప్‌కుమార్‌ను పార్టీ బరిలోకి దింపింది. బైందూరు ఎమ్మెల్యే సుకుమార్ శెట్టికి ఈసారి నిరాశే ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని గురురాజ్ గంటిహోళీకి అవకాశం ఇచ్చింది. అదే విధంగా అవినీతి ఆరోపణలపై అరెస్టైన బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను పార్టీ పక్కకు పెట్టింది. చన్నగిరి నుంచి ఆయనను తప్పిస్తూ.. శివకుమార్‌కు సీటు ఇచ్చింది.

ఇక దావణగెరె నార్త్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్, హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌కు పార్టీ మొండిచేయి చూపింది. వీరి స్థానాల్లో లోకికెరె నాగరాజ్, గవిసిద్దప్ప ద్యామన్నవర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల దాఖలు నేటి నుంచి (ఏప్రిల్ 13) ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. 

ఒక్కొక్కరిగా దూరం..
189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా.. ఇందులో 52 మంది కొత్తవారికి ఈ సారి అవకాశం కల్పించింది. దీంతో టికెట్‌ కోసం అడుక్కుతినని చెబుతూ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి లక్ష్మణ  సవది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళూరు సుళ్య టికెట్‌ చేజారడంతో మంత్రి ఎస్‌.అంగార రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి కేఎస్‌.ఈశ్వరప్ప కూడా రాజకీయ విరమణ ప్రకటించడం తెలిసిందే.మరోవైపు అసమ్మతి చల్లార్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. . టికెట్‌ దక్కని నేతలు అసంతృప్తితో పార్టీకి దూరమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement