హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టార్ ధిక్కారస్వరం వినిపించారు. ‘హూబ్లీ–ధార్వాద్ సెంట్రల్ టికెట్ నాకివ్వాల్సిందే. లేదంటే ఈసారి ఎన్నికల్లో పార్టీ 20 నుంచి 25 స్థానాల్లో ఓటమిని చవిచూస్తుంది’ అని షెట్టార్ శనివారం వ్యాఖ్యానించారు. నవ తరం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీచేయొద్దని సూచించింది. అలా షెట్టార్‌కు ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీనిని బేభాతరు చేస్తూ ధిక్కార స్వరం వినిపించారు.
దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లికి వచ్చి షెట్టార్‌తో మంతనాలు జరిపారు. అయినా సరే వినని షెట్టార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ సిట్టింగ్‌లను పక్కనబెడితే ఆ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడకూడదు. ఒకవేళ పడితే అది ఆ ఒక్క స్థానానికే పరిమితం కాదు. ఉత్తర కర్ణాటకలో కనీసం 20–25 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదముంది. ఈ మాట గతంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా చెప్పారు. వేచి చూస్తా. నాకు టికెట్ ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తా’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment