సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై ఉన్నట్టుండి ప్రేమ కురిపిస్తున్నారని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రేమ ఎక్కువైపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్నటి వరకూ టీడీపీ నేతలు ప్రతి ఒక్కరూ పవన్‌ను తిట్టారని, ఇప్పుడేమో ప్రేమ బాణాలు విసురుతున్నారని, ఈ ప్రేమకు సమాధానం టీడీపీ నేతలే చెప్పాలని ఆయన అన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
విమర్శల విషయంలో పవన్ స్థానంలో కేసీఆర్‌ను ఎందుకు పెట్టారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తానేదో జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు టీడీపీ నేతలు అంటున్నారని, హోదా విషయంలో ఎవరు యూటర్న్ తీసుకున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 650 అవార్డులు వచ్చాయంటున్నారు.. మళ్లీ అమిత్‌షా, మోదీపై బురదజల్లుతారు.. ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తే, రాష్ట్రమే అంతా చేసిందని డబ్బాలు కొట్టుకుంటున్నారని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలోని దారుణ పరిస్థితులే రాష్ట్రంలోని వైద్య రంగం పనితీరుకు ఉదాహరణ అని చెప్పారు.
రైల్వే జోన్ కూడా ప్రారంభించేస్తారా?
‘కడపలో స్టీల్‌ప్లాంటు నిర్మిస్తామంటూ ఒక రాయి వేశారు. రేపు విశాఖ రైల్వే జోన్ నిర్మిస్తామంటూ మరో రాయి వేస్తారేమో’ అంటూ విష్ణుకుమార్ రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు కలుగజేసుకుంటూ స్టీల్ ప్లాంట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment