లక్ష్మణ్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్టు చేసి తిరుమలగిరి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలవడానికి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే నిర్బంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్‌ను పోలీసులు మంగళవారం అరె స్టు చేశారు. రాజాసింగ్‌ను గృహనిర్బంధం చేశారు. పరిపూర్ణానందపై పోలీసులు విధించిన బహిష్కరణను ఎత్తివేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి బీజేపీ ఎమ్మెల్యేలు గతంలోనే సీఎం అపాయింట్‌మెంటు కోరారు. సీఎం కార్యాలయం నుంచి స్పంద న లేకపోవడంతో నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి, సీఎం కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
అసెంబ్లీలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమై, అక్కడి నుంచి బృందంగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోకుండానే పోలీసులు, వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కె.లక్ష్మణ్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అరెస్టుచేసిన పోలీసులు, తిరుమలగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కిషన్‌రెడ్డిని నగర పోలీసు కమిషనర్ కార్యాలయం దగ్గర అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావును అరెస్టు చేసి, హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు, ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అంబర్‌పేటలో అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్‌లకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అరెస్టులు అక్రమం: మురళీధర్‌రావు
రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమైన విషయంలో కలవడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారా అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు ట్విట్టర్‌లో మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రావణరాజ్యం నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ కృష్ణదాస్ విమర్శించారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment