
మాధవ్ (ఫైల్)
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన జై తెలుగుదేశం వెబ్ పేజీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డీజీపీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జై తెలుగుదేశం వెబ్ పేజీలో బీజేపీ జాతీయ యువ మోర్చా అధ్యక్షురాలు పూనమ్ మహాజన్‌పై కథనాలు వస్తున్నాయని, పూనమ్ మహాజన్ వాట్సాప్ చాటింగ్ పేరుతో పోస్టింగులు.. వైఎస్సార్ సీపీ నేతల నుంచి పూనమ్ మహాజన్ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు విస్తృతంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.
బీజేపీ-వైఎస్సార్ సీపీలు కలిసి పని చేస్తున్నాయంటూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు పర్యటనలో నిరసనలకు సీఎం పిలుపునిచ్చారని అన్నారు. సీఎం పిలుపు నేపథ్యంలో ఏపీ పోలీసులు ప్రధానికి ఏ మేరకు భద్రత కల్పిస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. అమిత్ షాపై తిరుపతి వద్ద జరిగిన దాడి ఘటనలో పోలీసుల పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment