సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి అనేక విషయాల్లో కేంద్రంను ఎద్దేవా చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బీజేపీపై సీఎం విమర్శలు సరికాదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంగా బయటకు వచ్చామని చెప్పడం దారుణం అని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదా నెపంను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మంచి అంతా తన వల్ల జరిగింది... చెడు అంతా కేంద్రందే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది.. దక్షిణాది అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, కేంద్ర సహకారం లేకుండానే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. 'కియో మోటార్స్ కేవలం చంద్రబాబు వల్లే వచ్చిందా? కేంద్ర సహకారం లేకుండానే కియో మోటార్స్ వచ్చిందా? పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఏఆర్జి ఫండ్స్, గృహనిర్మాణం, విద్యుత్ కోతలు లేని పరిస్థితి, రహదారుల అభివృద్ధి, ఇవన్నీ కేంద్ర సహకారం లేకుండానే జరిగాయా? పీఎం దేశానికి ప్రధాన సేవకుడుగా పని చేస్తున్నారు. ప్రత్యేక హోదా పై 14వ ఆర్ధిక సంఘం చెప్పిన దానిని తప్పుగా చెబుతున్నారు.
దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇచ్చిందని టీడీపీ నిరూపిస్తే దాని కోసం బీజేపీ కూడా కట్టుబడి వుంటుంది' అని మాధవ్ అన్నారు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి ప్రత్యేక హోదా పేరుతో అన్ని వర్గాలను కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కిందటే హోదా రాదని ముఖ్యమంత్రికి తెలుసన్న ఆయన ప్రతి పక్షాల వలలో చిక్కుకున్న పక్షిలా సీఎం వైఖరి వుందన్నారు. స్పెషల్ పర్పస్ విషయంలో నిధులు ఇస్తామని అరుణ్ జెట్లీ చెప్పారని, దీనిపై రాష్ట్రానికి ఏమైనా ఆలోచన వుందా? లేదా అని ప్రశ్నించారు. రైల్వే జోన్ పై ఫీజుబిలిటీ లేదని ఆనాడే రైల్వే మంత్రి చెప్పారని, రాజకీయ నిర్ణయం ద్వారానే అది సాధ్యం అవుతుందని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
బీజేపీ ద్వారా రైల్వే జోన్ వస్తుందని, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ కేంద్రం చిత్తశుద్ధి తో వుందని గుర్తు చేశారు. హైదరాబాద్ నిర్మాణం క్రెడిట్ చంద్రబాబుదేనని అంగీకరిస్తున్నామని, ఇదే సందర్భంలో తొమ్మిదేళ్ళ పాలనలో ఏపీలోని 13 జిల్లాలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు జరిగిన కేంద్రీకృత అభివృద్ధి వల్లే నేడు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలు వెనుక బడి వున్నాయని, కేంద్ర నిధులు రాకపోవడం వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు ఏమైనా వున్నాయా? అని ప్రశ్నించారున. కేంద్రం ద్వారా జరుగుతున్న ప్రాజెక్ట్ లను ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు. తాడేపల్లి ఎన్ఐఐటి నిర్మాణంలో కాంపౌండ్ వాల్ ను మధ్యలో నిలిపేసిన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏడాది సమయం పట్టిందని, ఎయిమ్స్‌తోపాటు అన్ని కేంద్ర సంస్థలకు నిధులు మంజూరు చేశామన్నారు.
వలలో చిక్కుకున్న పక్షిలా చంద్రబాబు : బీజేపీ
Published Tue, Mar 13 2018 10:01 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment