సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు నలుగురే గెలిచారంటూ ఎగతాళి చేస్తున్నారు. దిక్కులు కూడా నాలుగే.. ఆ నలుగురే రేపు టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతారు’’ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బీజేపీని సీరియస్‌గా తీసుకోవద్దు అంటూనే మరోవైపు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అంటే వణికిపోతున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓటర్లను మారుస్తున్నారని, ఓటర్ల జాబితా సరిగా లేదని ఆరోపించారు. రివ్యూ చేసే అవకాశం లేకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అందరిని భయపెడుతున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలంటూ సవాల్ విసిరారు. అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుని హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రజలతో పాటు కొడుకుని కూడా సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని, కూతురిని గెలిపించుకోలేని కేసీఆర్ పార్టీని ఏం కాపాడుకుంటారంటూ ఎద్దేవా చేశారు. స్వామీజీలు చెప్పారని అసెంబ్లీ కూలగొట్టడం సరికాదన్నారు. కూలగొట్టి మళ్లీ కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవన్నారు.
టీఆర్‌ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది : బండి సంజయ్
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్‌ఎస్.. లోక్‌సభను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అంటున్న టీఆర్‌ఎస్ అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతవరకు ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. చేసిన వాటి నిర్మాణమే పూర్తి కాలేదని, పేద వాళ్లు ఇల్లు కావాలని అనుకుంటారు కానీ డబుల్ బెడ్ రూం ఇళ్లే కావాలని అనుకోరని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో టీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment