
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడటం దారుణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడిపై దాడి జరిగినా సీరియస్‌గా తీసుకోవాల్సిందిపోయి..చంద్రబాబు చౌకబారు విమర్శలు చేయడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపానుతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్లడం సిగ్గుచేటన్నారు.
తిట్లీ తుపాను విషయంలో కూడా చంద్రబాబు చేసింది తక్కువా..ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. విపత్తుల సమయంలో చంద్రబాబు వేరే ప్రాంతాలకు వెళ్లడం పరిపాటిగా మారిందని విమర్శించారు. మూడేళ్లలో స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద ఏపీకి రూ.1247కోట్లు వచ్చాయని, ఎంతమేరకు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ పార్టీ కాదని, ఏపీని దాటేంత సీన్ కూడా ఆ పార్టీకి లేదన్నారు. ఈ విషయం తెలంగాణ ఎన్నికల్లో రుజువైందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ పరిస్థితి అదే విధంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రచారం వల్లే తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సీట్లు రాకున్నా ఓట్ల శాతం పెరిగిందని, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు నిరాశ కలిగించాయని తెలిపారు. లోక్ సభ ఫలితాలు మాత్రం బీజేపీ అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment