బెంగళూరు సాక్షి/ శివాజీనగర/ మైసూరు: ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకోవడాన్ని మూడో చెవి కూడా విందా?, అవుననే అంటున్న కొందరు నాయకులు. కన్నడనాట మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేకెత్తిస్తున్నాయి. గత నెలాఖరు వరకు పరిపాలించిన జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని తాజాగా తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్, జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్‌తో పాటు పలువురు నాయకులు తమ ఫోన్ల ట్యాపింగ్‌జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఫోన్ల సంభాషణలను చాటుగా విన్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు అప్పటి బెంగళూరు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ సుత్రధారిగా భావిస్తున్నారు.
కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనతో పాటు అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరి ఫోన్లను ట్యాపింగ్ చేయించి ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారంటూ జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. బుధవారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాప్ కావడంతో తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయన్న విషయం వెలుగు చూసిందన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. వీటన్నింటి వెనుక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హస్తం ఉందని, అనర్హత ఎమ్మెల్యేలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి కుమారస్వామి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని, రాజీనామాను ఉపసంహరించుకోకపోతే ఆడియో క్లిప్పులు బహిర్గతం చేస్తామంటూ ప్రభుత్వం కూలిపోకముందు కుమారస్వామి స్వయం గా ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. దీనిపై అనర్హత ఎమ్మెల్యేలమంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. తమ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు.
ట్యాపింగ్‌పై విచారించాలి: జీటీ
మైసూరు: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపించాలని జేడీఎస్ మాజీ మంత్రి జీటీ దేవేగౌడ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని, దానిపై ఆసక్తి కూడా లేదన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీలోని స్నేహితులు కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి యడియూరప్పతో భేటీ కావడం వెనుక మైసూరు పాల సమాఖ్య ఎన్నికల గురించి చర్చ తప్ప మరేమీ లేదన్నారు. మైసూరు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment