సాక్షి, హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగుతోంది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయించడంతోపాటు కేంద్ర పథకాల ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుండటాన్ని సాక్ష్యాలతో సహా ప్రజల ముందుం చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన కమలనాథులు.. పక్షం రోజులకో కేంద్ర మంత్రిని తెలంగాణకు పంపాలని నిర్ణయించారు. ఢిల్లీ సూచనలను అమలు చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
కేంద్ర ఫలాలు నేరుగా అందేలా..
10 రోజుల క్రితం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సూర్యాపేటకు వచ్చారు. ఉజ్వల పథకం కింద పేద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. తెలంగాణకు 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ‘ఉజ్వల’కోసం 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నీరుగారుస్తోందంటూ ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వ్యూహాత్మకంగానే రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందంటూ బీజేపీ ప్రచారం మొదలెట్టింది.
5న గడ్కారీ.. తర్వాత నడ్డా..
ఈ నెల 5న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్రానికి రానున్నారు. దాదాపు రూ.1,500 కోట్ల విలువైన రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు, ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్లు, అంబర్‌పేట కూడలి మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ రహదారుల్లో తెలం గాణ రెండో స్థానానికి చేరుకోవటానికి మోదీ ప్రభుత్వం తెలంగాణపై చూపు తున్న ప్రత్యేక శ్రద్ధే కారణమని గడ్కారీతో ప్రచారం చేయించనున్నారు. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రానికి రాబోతున్నారు. తెలంగాణలో రూ.3,500 కోట్లతో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ఇలాంటి ప్రాజెక్టులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయనతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికలు ముగియగానే..
కర్ణాటక ఎన్నికలు ముగియగానే జూన్‌లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు రానున్నారు. జూన్‌లో నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిన తీరు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రచారం చేయనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ నెలలో మొత్తంగా 60 బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక రచిస్తున్నామని, కొన్ని సభల్లో స్వయంగా షా పాల్గొంటారని పేర్కొంటున్నారు.
ఇప్పటికే దళితవాడల్లో నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం ఎలా విఫలమైందో తుక్కుగూడలో 4 రోజుల క్రితం నిర్వహించిన సభలో వివరించారు. కాగా, షా తెలంగాణ పర్యటన వరకు బీజేపీని పట్టించుకోని టీఆర్‌ఎస్ నేతలు.. ఆయన రాకతో బీజేపీ టార్గెట్ చేయటం మొదలెట్టారు. తెలంగాణను కూడా త్రిపుర చేస్తామంటూ బీజేపీ నుంచి వస్తున్న కామెంట్లను వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
కారుతో కొట్లాటకు కమలదళం!
Published Thu, May 3 2018 1:57 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment