సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ సొంతబలం తోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, నరేంద్రమోదీ ప్రధానిగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీఎం కేసీఆర్ చెప్పటం హాస్యాస్పదమని, ఇప్పటికైనా ఆయన పగటి కలలు కనటం మానుకోవాలని అన్నా రు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీ తోనూ పొత్తు పెట్టుకోవటం లేదని పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ కార్యవర్గసభ్యుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ, విజయరామారావు, చింతా సాంబమూర్తి, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతోందని, రాష్ట్రంలో గౌరవప్రదమైన సంఖ్య లో అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అసెంబ్లీ కోర్ కమిటీలో దరఖాస్తులను పరిశీలించి, ఆ తర్వాత జిల్లా కోర్ కమిటీలో చర్చించి, పరిశీలకుల ఆధ్వర్యంలో తుది నివేదికను సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కోసం వాట్సాప్ నంబర్ 9701730033 ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ నేతలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment