
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 13 రోజులైనా తదుపరి సీఎం ఎవరనేది ఇంతవరకూ వెల్లడికాలేదు. అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య చిక్కుముడి వీడకపోవడం, శివసేనతో కలిసేందుకు ఇతర విపక్షాలు ముందుకురాని పరిస్థితితో తదుపరి మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈనెల 9న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్ తరుముకొస్తుండటంతో రాజకీయ పార్టీలతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెడ్‌లైన్ నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ ప్రతినిధి బృందం కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ చాలా దూరంలో నిలిచిన క్రమంలో ఈ ప్రతినిధి బృందానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దూరంగా ఉన్నారు. శివసేన లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సుముఖంగా లేదని చెబుతున్నారు.
మరోవైపు డెడ్‌లైన్ ముగిసిన తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు చొరవ చూపాలని అన్నారు. కాగా శివసేన మాత్రం తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమని విస్పష్టంగా పేర్కొంటోంది. బీజేపీపై ఒత్తిడి పెంచేలా సేన వ్యాఖ్యలున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment