
సాక్షి, కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చేయకుండా టీడీపీ కంకణం కట్టుకుందని అందుకే దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ రాయలసీమ ద్రోహి పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లుగా పరిపాలిస్తున్న చంద్రబాబు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయమని ఏరోజు కేంద్రాన్ని అడగలేదని ఆయన పేర్కొన్నారు.
రెండుసార్లు అడిగినా స్పందించలేదు : బీజేపీతో పొత్తులో ఉన్నప్పడు నాలుగేళ్లుగా ఎందుకు ఉక్కు పరిశ్రమ కోసం నిలదీయలేదని విష్ణువర్ధన్ చంద్రబాబును ప్రశ్నించారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే ఓట్లు వేయయని కడప జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయాలి అన్న వ్యాఖ్యలని ఉటంకిస్తూ, టీడీపీపై నిప్పులు చెరిగారు. 2014 డిసెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని, తిరిగి 2016లో అడిగినా కూడా రాష్ట్ర ఎటువంటి స్పందన ఇవ్వలేదని వెల్లడించారు. ఇప్పటికీ కూడా జిల్లలో ఉక్కు పరిశ్రమ వద్దు అని పరోక్షంగా టీడీపీ నేతలు అంటున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు లో కేంద్రం అఫిడవిట్ దాఖలు విషయంలో అవసరమైన విషయం పక్కన పెట్టి, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
రాయలసీమలో హైకోర్టు, రెండో రాజధాని పెట్టగలరా? : కడప జిల్లాలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాయలసీమలో టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. అలానే రాయలసీమలో చంద్రాబాబు హైకోర్టు ఏర్పాటు చేయగలరా అని ప్రశ్నించారు. రాయలసీమను బీజేపీ రత్నాల సీమను చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి దమ్ముంటే రాయలసీమలో ఒకజిల్లాను రెండవ రాజధాని చేయాలంటూ సవాల్ విసిరారు.
సీమవాసులను రౌడీలుగా చిత్రీకరించారు : రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా రాయలసీమ రౌడీలు వచ్చారంటూ చంద్రబాబు సీమ ప్రజలను గుండాలుగా చిత్రీకరించారని మండిపడ్డారు. కోర్టులను మేనేజ్ చేయించుకోగల శక్తి చంద్రబాబుకు ఉందని, ఆవిషయం ప్రజలు బాగా తెలుసునని అన్నారు. అభివృద్ధి మొత్తం అమరావతిలో పెడితే సీమ పరిస్థితి ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఇక్కడి పరిశ్రమలు, సాగు నీటి ప్రాజెక్టులు, ఏమై పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు రావాలంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment