సాక్షి, నెల్లూరు: తమ వైఫల్యాలను, అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆ పార్టీ అధినేతనే బురిడీ కొట్టించారు. పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చి అధినేత చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు అడ్డదారులు తొక్కారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాతో పేర్లను పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు నమోదుచేయడం వివాదాస్పదంగా మారింది. పార్టీ సభ్యులుగా నమోదయిన వారిలో దాదాపు 20 శాతం మంది ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులుగా తేలింది. ఇదిలా ఉంటే పార్టీ సభ్యత్వ రుసుం చెల్లింపుల కోసం నియోజకవర్గానికి మంజూరైన ఉపాధి హామీ నిధులను మార్కెట్‌లో పెట్టి ఆరుశాతం కమీషన్లు తీసుకుని విక్రయించేశారు. ఆ నగదును పార్టీ సభ్యత్వ రుసుంపంపినట్లు ఆరోపణలుండడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు..
ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తన నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి కంటే అతని వైఫల్యాలే అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు తమ అస్మదీయులకే అన్ని బాధ్యతలు అప్పగించడం, కష్టపడిన కార్యకర్తలను విస్మరించడం, అవినీతిని ప్రోత్సహించి పసుపు కుంభకోణంలో పార్టీనే రోడ్డున పడేయడం, ఫైబర్‌చెక్ డ్యామ్‌ల పేరుతో అక్రమాలకు పాల్పడడం వంటి వైఫల్యాలు ఎమ్మెల్యే బొల్లినేని చుట్టుముట్టాయి. దీంతో పాటు ఫైబర్ చెక్‌డ్యామ్‌ల పనులు పార్టీ నేతలకు పందేరం చేసి, వారికి బిల్లులు ఎగనామం పెట్టడంతో బాధితులు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అలాగే మహారాష్ట్రలో విదర్భ కుంభకోణంలో కీలకపాత్ర పోషించి కేసులు వరకు వెళ్లడం, పలువురు సబ్ కాంట్రాక్టర్లకు రూ.కోట్లలో బిల్లులు ఎగనామం పెట్టడం ఇలాంటి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో తమ అవినీతి, అక్రమాలను అధిగమించి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు పార్టీ సభ్యత్వాలను దృష్టి పెట్టినట్లు తెలిసింది. అధికార పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని నమోదైన సభ్యత్వాలను మించి చేసి అధినేత దృష్టిని ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల జాబితాలను ముందేసుకుని సుమారు 80 వేల సభ్యత్వాలు నమోదు చేశారు. ఆయా సభ్యత్వాల్లో దాదాపుగా 20 శాతం ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులు ఉండడం విశేషం. ఈ విషయం ఇటీవల కొందరు ఉదయగిరి నేతలు ఆ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉపాధి పనులు పందేరం
ఉదయగిరి నియోజకవర్గానికి ఇటీవల దాదాపు రూ.8.5 కోట్లు ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. ఆయా నిధులను స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వ్యక్తిగత సహాయకుడు, మండల పార్టీ కన్వీనర్ల ద్వారా ఆరు శాతం కమీషన్ వంతున పలువురు కాంట్రాక్టర్లకు అభివృద్ధి పనులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో ఉపా«ధి నిధులను కాంట్రాక్టర్లకు కేటాయించడం వివాదంగా మారింది. పార్టీని నమ్ముకుని జెండా మోసిన వారిని కాదని అభివృద్ధి పనులను ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఏమిటని వారు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. అలా వసూలు చేసిన నగదును పార్టీ సభ్యత్వ రుసుంకు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. ఉపాధి హామీ పనుల పందేరం విషయంపై నియోజకవర్గ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోమారు టికెట్ కోసమేనా?
ఉదయగిరి అధికార పార్టీలో రానున్న ఎన్నికల్లో టికెట్ల లొల్లి జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేనిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో టికెట్ సిట్టింగ్‌కు ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీలోని సెకండ్ కేడర్ లీడర్లు పోటీ పడుతుండడంతో అధినేత దృష్టిని ఆకర్షించి మరోమారు టికెట్ తెచ్చుకునేందుకు ఇలాంటి అడ్డదారులు తొక్కారనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment