
సాక్షి, అమరావతి : గవర్నర్ వ్యవస్థ పనికిమాలిందని గతంలో విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారో చెప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనే వైఖరి హేయమైందని అన్నారు. కోడెల అంతిమ సంస్కారాలు కూడా అధికారిక లాంఛనాలతో జరగకుండా చేసి ఆయనపై ఉన్న అక్కసును చంద్రబాబు బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీబీఐ రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కోడెల కేసులో సీబీఐ విచారణ కోరడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్రం చెప్పుచేతుల్లో సీబీఐ ఉందని అప్పుడు విమర్శించిన చంద్రబాబుకు.. ఇప్పుడూ కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉందని తెలియదా అని మండిపడ్డారు. అసలు కోడెల వాడిన ఫోన్ ఏమైందో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
నువ్వు కాదా క్షోభ పెట్టింది?
కోడెల మృతి చుట్టూ ఉన్న అనుమానాలను చంద్రబాబే నివృత్తి చేయాలని బొత్స డిమాండ్ చేశారు. గత మూడు నెలల్లో ఎన్నిసార్లు, ఏ అంశంపైనా కోడెలను చంద్రబాబు కలిశారన్ని బయటపెట్టాలన్నారు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా కోడెలను క్షోభ పెట్టింది చంద్రబాబే అన్నారు. బీజేపీలో చేరేందుకు కోడెల ఎందుకు ప్రయత్నించారన్నారు. టీడీపీలో గౌరవం లేదని, అందుకే బీజేపీలో చేరాలని కోడెల భావించినట్లు బీజేపీ నేతలే చెప్పారని బొత్స వివరించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే అప్పటి గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ యోగక్షేమాలను ఫోన్ ద్వారా తెలుసుకున్నపుడు.. చంద్రబాబు మాట్లాడిన భాష, తీరును బొత్స గుర్తుచేశారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఇంకొకలా వ్యవహరించడమేనా 40 ఏళ్ల అనుభవం అంటే.. అని చంద్రబాబును ప్రశ్నించారు. కోడెల మృతిపై గవర్నర్‌కు సమర్పించిన వినతిలో ఎక్కడా సీబీఐ విచారణకు డిమాండ్ చేయకుండా, ప్రెస్‌మీట్లలో మాత్రమే సీబీఐ విచారణ కోరడంలో ఉద్దేశమేంటన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగబద్ధంగా పనిచేసిందా అని ప్రశ్నించారు.
కేసులతో ప్రభుత్వానికి సంబంధమేంటి?
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం బాధితులు ముందుకు వచ్చి కేసులు పెడితే ప్రభుత్వానికి సంబంధమేంటని బొత్స ప్రశ్నించారు. ఆ కేసులను చంద్రబాబు, లోకేశ్, ఇతర నాయకులు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. సాక్షి పేపరు, సాక్షి టీవీ వల్లే గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన అరాచకాలకు, దౌర్జన్యాలు ప్రజలకు తెలిశాయని, ఎల్లో మీడియాను మొత్తం చెప్పుచేతుల్లో పెట్టుకొని తమ పార్టీపై దుష్ప్రచారం చేశారని వివరించారు. ఇప్పుడు చట్టాల గురించి చంద్రబాబు చెబుతుంటే విడ్డూరంగా ఉందని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు.
సెల్‌ఫోన్ ఏమైంది?
కోడెల సెల్‌ఫోన్ పోయిందని పుకార్లు వస్తున్నాయని, చంద్రబాబు దాని గురించి ఎందుకు అడగడం లేదని బొత్స ప్రశ్నించారు. ఆత్మకూరులో రెండు కుటుంబాల సమస్యను రాజకీయం చేశారని, పెయిడ్ ఆర్టిస్టులతో క్యాంపులు రన్ చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అనవసరంగా చంద్రబాబు చాలెంజ్‌లు చేసి, పరుష పదజాలంతో మాట్లాడితే ఎవరూ భయపడరని, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment