సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హత్య రాజకీయాలు అలవాటేనని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో చంద్రబాబుపై అనుమానాలు బలపడుతున్నాయని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తాము కోరితే.. చంద్రబాబు సిట్ వేసి కేసును నీరుగార్చే యత్నం చేశారని మండిపడ్డారు. ఎన్‌ఐఏ విచారణకు సిట్ సహకరించడం లేదని తెలిపారు. ఈ కేసులో కుట్రకోణంపై విచారణ జరపాలని ఎన్‌ఐఏ చార్జీషీట్ దాఖలు చేస్తే.. కేసు హైకోర్టు పరిధిలో ఉందని చెప్పి సిట్ అధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారని చెప్పారు.
ఎన్‌ఐఏ విచారణను చంద్రబాబు పదేపదే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో టీడీపీ నేతలకు సంబంధం లేకుంటే.. ఎన్‌ఐఏ విచారణను అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే దాన్ని తప్పుదోవ పట్టిస్తారా అని ప్రశ్నించారు. నీచపు ఆలోచనలతోనే చంద్రబాబు సర్కార్ ముందుకెళ్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్‌ఐఏ విచారణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment