సాక్షి, అమరావతి : రాజధానికి విశాఖపట్నం అనువైన ప్రాంతం అని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిని ఏపీలో అభివృద్ది చేయాలంటే విశాఖపట్నంను మించి మరో ఆప్షన్ లేదని,ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అన్నారు. హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెందుతున్న విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. వెనుకబడిన ప్రాంతాలు,కరువుతో అల్లాడిన ప్రాంతాలు అభివృద్ది చెందడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఒక టౌన్‌షిప్‌ను తయారుచేయడం ద్వారా అభివృద్ది సాధ్యపడదని, ఐదు కోట్ల మంది ఆర్థిక స్థితి గతులు మెరుగుపడవన్నారు.
గత ప్రభుత్వం మొత్తం రూ.1లక్షా 90వేల కోట్లు అప్పులు తెచ్చిందని, అందులో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే రాజధాని కోసం ఖర్చు పెట్టిందని అన్నారు. మిగతా డబ్బును ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాలను,ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా రాజధానిపై ఇష్టారీతినా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.
రాజధానిపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. రాజధానిపై సుజనా చౌదరి చెప్పిందేమైనా వేదమా..? శాసనమా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి కాబట్టే.. ఇప్పుడు రాజధానిని మార్చాల్సివస్తుందన్నారు. అశోక గజపతిరాజు కూడా రాజధాని నిర్ణయంపై విమర్శిస్తున్నారని, అసలు ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శించినా, ఏం ఆరోపించినా జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. హైపవర్ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని జిల్లాల అభివృద్ధే ధ్యేయం తప్ప ప్రాంతీయ ద్వేషం ఉండదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment