
యశవంతపుర (బెంగళూరు): కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సోమవారం శాసనసభలో చర్చ జరుగుతుండగా, బీఎస్పీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.మహేశ్ తన మొబైల్‌లో అమ్మాయిల ఫోటోలను వీక్షిస్తూ కెమెరాలకి చిక్కారు. సభ ప్రారంభానికి ముందు సభలోకి వచ్చి కూర్చున్న మహేశ్ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌లో అమ్మాయిల ఫోటోలను చూడసాగారు. సభలో సభ్యులు మాట్లాడుతుండగా మహేశ్ ఫోన్‌లోనే నిమగ్నమయ్యారు. గతంలో బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్‌ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సభలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు.
ఫోన్ల వినియోగానికి ప్రత్యేక గదిని కేటాయించారు. నిషేధం ఉన్నప్పటికీ మహేశ్ సభలోకి ఫోన్ తీసుకురావడం వివాదాస్పదమైంది. అయితే, తన కొడుకుకు వధువును వెతికే ప్రయత్నాల్లో భాగంగా ఓ మిత్రుడి పంపిన అమ్మాయిల ఫొటోలను తాను అసెంబ్లీలో చూశానని, ఈ విషయంలో దురుద్దేశాలు ఆపాదించరాదని, ఆ ఫొటోలను టీవీల్లో చూపించి.. వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఎమ్మెల్యే మహేశ్ మీడియాను కోరారు.