సాక్షి, అమరావతి : కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. తమ ప్రభుత్వంపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాయిటర్స్ తప్పుడు వార్తలను ప్రచురించిందని, ఆ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కియా విషయంలో కావాలనే గందరగోళం సృష్టించారని, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ రంగంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
(చదవండి : కియా మోటార్స్ ఎక్కడికి తరలివెళ్లడం లేదు)
తమ ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో కియా సంస్థ యాజమాన్యం ఎంతో సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అసలు ఈ రకమైన వార్తలు ఎందుకు వచ్చాయో తమకు కూడా తెలియదని కియా సంస్థ యాజమాన్యం చెప్పిందని బుగ్గన అన్నారు. కొందరు కావాలనే కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో పరిశ్రమల పెట్టుబడులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. బిర్లా, ఏటీసీ టైర్స్, స్మార్ట్‌టెక్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు త్వరలేనే ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయని బుగ్గన పేర్కొన్నారు.
చంద్రబాబే ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు
చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో పరిశ్రమలకు రూ.3500 కోట్ల రాయితీలను చెల్లించలేదని బుగ్గన ఆరోపించారు. డీపీఆర్‌లు లేకుండానే రూ.లక్ష కోట్లకు టెండర్లు పిలిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. సివిల్ సప్లయ్, డిస్కమ్‌లపై రూ.20వేల కోట్లకు పైగా అప్పుడు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్తూ వెళ్తూ ఒక్క రోజులో రూ.5వేల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై రుద్దారని విమర్శించారు. చంద్రబాబు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని బుగ్గను ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment