
సాక్షి, వైఎస్సార్ కడప : అగ్రవర్ణాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఏ కులానికి ఎంత అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.రామచంద్రయ్య అన్నారు. అసలు కేంద్రం ఇచ్చిన రిజర్వేన్ల అంశం ఎంత వరకు నిలబడుతుందో తెలియని పరిస్థితుల్లో.. అందులోనుంచే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు కులాల కుంపటి రాజేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లు ఇంకా చేరనేలేదని వెల్లడించారు.
‘2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏమేరకు అమలు చేశాడో ప్రజలు గమనించాలి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైఎస్ జగన్ చెప్పిన ‘నవరత్నాలు’లోంచి ఒక్కొక్కటి వదులుతున్నాడు. నాలుగున్నరేళ్లుగా అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం గురించి తెగ ఆలోచిస్తున్నారు. మీకు సంక్షేమం అంటే ఏంటో తెలుసా బాబూ’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు.
దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పంచె కట్టిన వాళ్లంటేనే బాబుకు పడదని.. అలాంటిది రైతులను ఆదుకుంటానని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు చెప్పినదానికల్లా తలలూపుతూ మంత్రులు తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకోద్దని హితవు పలికారు. అత్యధిక ఆదాయం వచ్చే గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేక విమానాల్లో తిరగడం లేదని.. కానీ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక విమనాల్లో పర్యటిస్తూ ప్రజాధనం వృధా చేయడంలో బాబుకెవరూ సాటిరారని చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment