
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బద్ధ శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్‌ల కలయికతో మనస్తాపానికి లోనైనా ఇరు పార్టీల నేతలు కొందరు ఇప్పటికే వారి పార్టీలను వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన రామచంద్రయ్య.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రయ్యకు కండువా కప్పిన వైఎస్ జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు అదే జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్ సుబ్బరాఘవరాజు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. రామచంద్రయ్య చేరికతో వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులను అంతమొందిచాల్సిన అవవసరం ఉందన్నారు. ఈ అక్రమాలను అరికట్టే శక్తి వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదని అన్నారు. తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని.. దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో వస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment