రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ట్రెడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి
సాక్షి, అమరావతి: కమిటీలతో కాలయాపన చేయకుండా రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. సీపీఎస్ రద్దు కోరుతూ విజయవాడలోని దాసరి భవన్‌లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగుల సమస్యగా ఉన్న సీపీఎస్ రద్దు కోసం జరుగుతున్న పోరాటానికి వామపక్షాల మద్దతు ఉంటుందని ప్రకటించారు. పోరాటాన్ని అణచివేసేందుకు చంద్రబాబు పోలీసులను ప్రయోగించడం దారుణమన్నారు.
ఛలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా అరెస్టులు చేసినప్పటికీ ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకుని ఉద్యమం నిర్వహించడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారికి ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడపై కత్తిలా ఉన్న సీపీఎస్ కన్పించడంలేదని, అందుకే అసెంబ్లీ ముట్టడిలో ఎన్‌జీవో నాయకుడు అశోక్‌బాబు లేడని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకుంటే నవంబర్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం చేసిన తీర్మానం వివరాలను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతామని చెప్పారు.
సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత జల్లి విల్సన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పోలారి, ఆమ్‌ఆద్మీ నేత పోతిన వెంకట రామారావు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ప్రధాన కార్యదర్శులు బాబురెడ్డి, జి.హృదయరాజు, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అ«ధ్యక్షుడు చలసాని రామారావు, శ్రామిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు కళ్లేపల్లి శైలజ, వీఆర్వో సంఘ నాయకుడు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.
సీపీఎస్ రద్దు ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పొట్టకొట్టే సీపీఎస్ రద్దు కోసం జరిగే ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి చెప్పారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి నుంచి సీపీఎస్ రద్దు కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని, ఉద్యమానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారని తెలిపారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు, హెలికాఫ్ట్టర్, విమానాల్లో చక్కర్లు కొట్టేందుకు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్న చంద్రబాబుకు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడానికి మనసు రావడంలేదని మండిపడ్డారు. 35 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించిన వ్యక్తికి పెన్షన్ భరోసా కూడా లేకుండా చేస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు సీపీఎస్ రద్దు విషయంలో ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment