సాక్షి, హైదరాబాద్: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించే సంఘటనలు ఇటీవల అధికం కావడంతో వీటికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళ్లబోనని అఫిడవిట్ ఇచ్చినవారికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఫారంలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు ఇదే మార్గమని పలువురు నేతలు ప్రతిపాదించారు.
న్యాయపరమైన అంశంతో నిమిత్తం లేకుండా కనీసం నైతికంగా బాధ్యత ఉంటుందనే ఆలోచనతోనే ఈ విధానాన్ని అమలు చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని, ఇలా చేయడం ద్వారా టీఆర్‌ఎస్ యథేచ్ఛగా పాల్పడుతున్న పార్టీ ఫిరాయింపుల అంశాన్ని చర్చనీయాంశం చేయవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా కూడా ఆ వాదనతో ఏకీభవించడంతో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతోపాటు సమావేశంలో పాల్గొన్న ఇతర నేతలంతా బలపర్చారు.
దీంతో ఈ మేరకు అఫిడవిట్ ఇచ్చిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారంలు ఇవ్వాలని నిర్ణయించారు. గెలిచిన తర్వాత పార్టీ మారబోనని అటు పార్టీకి హామీపత్రం ఇవ్వడంతో పాటు గ్రామ, మండల ప్రజలకు కూడా ఈ విషయాన్ని వెల్లడించాలనే నిబంధనను అంగీకరించిన వారికే బీఫారంలు ఇవ్వనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు మండల పార్టీకి, జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పార్టీకి అఫిడవిట్‌లు ఇవ్వాలని ఖరారు చేయగా, అఫిడవిట్ ఎలా ఉండాలన్న దానిపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వీలునుబట్టి ఎక్కడికక్కడే పొత్తులు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు రాష్ట్ర స్థాయిలో కుదుర్చుకునేది ఏమీ లేదని, ఎక్కడికక్కడ స్థానికంగా పొత్తులు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్, టీడీపీలతో గ్రామాలు, మండలాలవారీగా ఎక్కడ వీలుంటే అక్కడ పొత్తులు కుదుర్చుకోవాలని.. ఆ విషయాన్ని మండల, జిల్లా, రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని తీర్మానించారు. కాగా, తొలివిడత ఎన్నికలు జరగనున్న జిల్లాలు, మండలాల్లో అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు నమోదుకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఉన్నందున విస్తృతంగా ఓటరు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్‌కు అప్పగించగా, ఆయన బుధవారం సాయంత్రమే డీసీసీ అధ్యక్షులందరితో మాట్లాడి వారికి తగిన సూచనలు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా నేడు నిరసనలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ముక్కలు చేసి డంపింగ్ యార్డుకు తరలించడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ను టీఆర్‌ఎస్ అవమానించిన తీరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఉత్తమ్, కుంతియాలతో పాటు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, ఎ.చంద్రశేఖర్, ఏఐసీసీ ఓబీసీ సెల్ వైస్‌చైర్మన్ డాక్టర్ పి.వినయ్‌కుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ నేతలు కుమార్‌రావు, నగేశ్ ముదిరాజ్, ఇందిరాశోభన్‌లతో పాటు టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అ«ధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment