
లక్నో: తన భర్తను బీజేపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ భార్య రాజ్యసభ సభ్యురాలు తాజిన్ ఫాటిమా ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన భర్తపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆమె అన్నారు. కాగా ల్యాండ్ మాఫీయా కేసులో ఆజంఖాన్ ఉన్నారంటూ యూపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించినందుకు తన భర్తపై కుట్రపన్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక, ఇలా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు.
కాగా ఆజంఖాన్‌పై ల్యాండ్ మాఫీయాలో అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటివరకు 30 కేసులు కూడా నమోదయిన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ లోక్‌సభ పరిధిలో అనేక కేసులు ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తెలిపారు. ఆజంఖాన్ రెవెన్యూ శాఖమంత్రిగా ఉన్న (2012-2017) సమయంలో అమాయక రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని లాక్కుని, పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో రుజువైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. దీనిపై ఎస్పీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షసారింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment