బూర నర్సయ్య గౌడ్
ఢిల్లీ: ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలంతా కలిసి కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను విజ్ఞప్తి చేసినట్లు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. అలాగే మూడు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి ఎంపీలు తీసుకెళ్లినట్లు వివరించారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం బూర నర్సయ్య విలేకరులతో మాట్లాడుతూ..చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అలాగే ఎన్‌సీబీసీకి చైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఏక్ దేశ్- ఏక్ నీతి ఉండాలనేదే మా అధినేత కేసీఆర్ నినాదమని స్పష్టం చేశారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కూడా కేంద్రం ఇప్పటి వరకు ఓబీసీలకు సంబంధించిన మంత్రిత్వశాఖపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో ఒక్కో రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్‌సీబీసీ ఏర్పాటు చేసి 9 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment