
సాక్షి, పెరంబూరు : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కే ప్రస్తుతం ప్రజల్లో అధిక ఆదరణ ఉందని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్ రాధాకృష్టన్ అభిప్రాయపడ్డారు. లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తాననీ చెప్పారు. విజయ్ తాజా చిత్రం ‘సర్కార్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని ఆయన పేర్కొనడం అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు బీజేపీ నేతలు సైతం విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
ప్ర: హైడ్రో కార్బన్ పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పోరాటం చేయడంపై మీ స్పందన?
జ: అది పనికిమాలిన పని.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హైడ్రో కార్బన్ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు,
ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి?
జ: వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు.
ప్ర: నటుడు విజయ్ తాజాగా తాను సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించనని అనడం గురించి మీ కామెంట్?
జ: అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమే.
ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనుకేసుకురావడానికి కారణం?
జ: ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నాడు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా.. అలాంటి లండగొండులను పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది.
ప్ర: రజనీకాంత్ బీజేపీకి మద్దతునిస్తారా?
జ: రజనీకాంత్ ఇంకా పార్టీనే స్థాపించలేదు. ఐనా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? లేదా అన్నది తెలియదు.
ప్ర: లోక్‌సభ ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
జ: గత ఎన్నికల కంటే కూడా అధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను సొంతంగా.. కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment