
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యులు, మధ్యతరగతి వర్గాలను నిలువునా దహిస్తోన్న పెట్రో మంటలు అతికొద్దిరోజుల్లోనే ఆరిపోయే అవకాశం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ శుభవార్తను సూచాయగా వెల్లడించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో వాహనదారులు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అతి త్వరలోనే: ‘‘పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలోని బృందం.. చమురు సంస్థలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నది. అతిత్వరలోనే ధరల పెరుగుదలకు ఒక పరిష్కారం లభిస్తుంది. పెట్రోలియం మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు’’ అని అమిత్ షా వివరించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు పెంపును నిలుపులచేసిన ఆయిల్ కంపెనీలు.. ఆ తర్వాత ధరలను భారీగా పెంచేశాయి. ఒక దశలో లీటర్ పెట్రోలు 84 రూపాయాలకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం(మంగళవారం నాటికి) హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 81.4 రూపాయలు, డీజిల్ 74.04 రూపాయలుగా ఉంది.
బీజేపీ సూపర్: బీజేపీ కార్యకర్తలు ఏప్రిల్ 14 నుంచి మే 5 దేశంలోని 484 జిల్లాల్లో.. 21వేల పైచిలుకు గ్రామాల్లో చేపట్టిన గ్రామస్వరాజ్ అభియాన్ కార్యక్రమం విజయవంతమైందని షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, ప్రధాని నరేంద్ర మోదీ మాటలను మొత్తం 65 వేల గ్రామాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఎంపికను ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయిస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను షా తప్పుపట్టారు. ట్రైనింగ్ అనంతరం మాత్రమే శిక్షణ ఇవ్వలని భావిస్తున్నారే తప్ప ఎంపికను కాదని వివరించారు.