అమరావతి నుంచి రాజధాని మార్చనివ్వం | Chandrababu Comments On Capital City Amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతి నుంచి రాజధాని మార్చనివ్వం

Published Thu, Jan 2 2020 4:35 AM | Last Updated on Thu, Jan 2 2020 4:35 AM

Chandrababu Comments On Capital City Amaravathi - Sakshi

మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, చిత్రంలో ఆయన సతీమణి భువనేశ్వరి, తదితరులు

సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్‌/ మంగళగిరి: అమరావతి నుంచి రాజధానిని మార్వనివ్వబోమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెం, తుళ్లూరు మండలం మందడంలో చేస్తున్న నిరసన ప్రదర్శనలకు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి బుధవారం హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధానిని మార్చాలని చూస్తే కాలి భస్మమవుతారని వ్యాఖ్యానించారు. రాజధాని వస్తుందంటే ప్రశాంత వాతావరణానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కులం పేరుతో రాజధాని మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తనదేనని, ఇక్కడ అలాంటి అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద మొత్తం 55 వేల ఎకరాలున్నాయని, అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాత 10 వేల ఎకరాలు మిగులుతుందని పేర్కొన్నారు. వాటిని విక్రయించి ఆ డబ్బులతో రాజధానిని అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. 

నాతోనే సీఎం మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనతోనే మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలన వికేంద్రీకరణపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టారు. జీఎన్‌ రావుకు ఏమీ తెలియదని, అలాంటి వ్యక్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనను వికేంద్రీకరించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. తాను నిర్మించిన అసెంబ్లీలో జగన్‌ కూర్చొని తననే దూషిస్తున్నారన్నారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. జగన్‌ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు భయపెడి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారని చెప్పారు. విశాఖలో ఆదాన్‌ గ్రూప్, ప్రకాశం జిల్లాలో పేపరు పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్‌ పరిశ్రమలు ఇప్పటికే వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాజధానిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ వచ్చే సమయంలో రోడ్లపై ఎవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. రైతులు గట్టిగా నిలబడితే జగన్‌ పులివెందులకు పారిపోతారన్నారు. రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడతానని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

పోలీసులపై అక్కసు
‘పోలీసు అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. మీరు ఉద్యోగం వదిలి వెళ్లినా నా నుంచి తప్పించుకోలేర’ని చంద్రబాబు బెదిరించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కావాలనే తనను టార్గెట్‌ చేశారని, ఆయనను వదలమని హెచ్చరించారు. 

విరాళాలిచ్చి మరీ..
రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటాలకు టీడీపీ తరఫున రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు మందడంలో ప్రకటించిన చంద్రబాబు.. యర్రబాలెంలో వ్యక్తిగతంగా రూ.50 వేల విరాళం ప్రకటించి తక్షణమే అందజేశారు. కృష్ణాయపాలెంలో మరో రూ.50 వేలను ఓ నాయకుడి తరపున ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందెన్నడూ లేనివిధంగా ధర్నాలు, ఆందోళనలు చేయడానికి చంద్రబాబు విరాళాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆందోళనల్ని ఉధృతం చేయాలని, దానికోసం ఎంత ఖర్చయినా పార్టీ నాయకులు భరిస్తారని చంద్రబాబు ప్రకటించడం స్థానికులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సందర్భంలో ఆయన సతీమణి భువనేశ్వరి సైతం తన వంతుగా బంగారు గాజులను విరాళంగా అందజేసి.. రాజధాని అమరావతి తరలిపోకుండా మరింత ధర్నాలు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement