మోదీ అబద్ధాలకోరు | Chandrababu Fires On Narendra Modi In Karnataka | Sakshi
Sakshi News home page

మోదీ అబద్ధాలకోరు

Published Mon, Apr 22 2019 3:40 AM | Last Updated on Mon, Apr 22 2019 3:40 AM

Chandrababu Fires On Narendra Modi In Karnataka - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న చంద్రబాబు

గంగావతి: దేశ ప్రజలను అబద్ధాలతో మోసగించిన నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని కొప్పళ జిల్లా శ్రీరామనగరలో కాంగ్రెస్‌కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నరేంద్రమోదీ ఈ 5 ఏళ్లలో అబద్ధాలు తప్ప ఆచరణలో చేసిందేమీ లేదన్నారు. గుజరాత్‌లో పుట్టిన గాంధీ ఎప్పుడూ సత్యమే పలికారు, అక్కడే పుట్టిన నరేంద్ర మోదీ అసత్యాలు తప్ప మాట్లాడడం లేదన్నారు. ఇటువంటి ప్రధానిని నా రాజకీయ చరిత్రలో చూడలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, లాంటి పెద్ద రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో మోదీ అన్యాయం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తానన్న హామీని విస్మరించారని దుయ్యబట్టారు. కాశ్మీర్‌ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని, దీనిని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఈవీఎంలలోనూ దోషాలు కనిపిస్తున్నాయని, ఎన్నికల సంఘాన్ని సైతం దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర డ్యాం నీటి విషయంలో కర్ణాటకతో పేచీ పెట్టుకోబోమని అన్నారు.  

సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఆధారాలున్నాయా? 
సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరుతో నరేంద్ర మోదీ నాటకాలాడుతున్నారని, 350 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులను చంపేశామన్నారు. ఎక్కడా మీడియాలో ఈ దృశ్యాలు చూపించలేదు, మీతో ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టమని ఈ సభాముఖంగా బీజేపీ నాయకులకు సవాల్‌ విసురుతున్నా అన్నారు. తనను కూడా త్వరలోనే జైల్లో పెట్టాలని పన్నాగాలు పన్నుతున్నారు అని ఆరోపించారు. కాగా, ఈ సభ జనం లేక వెలవెలబోయింది.

మోదీ కంటే గొప్ప నేత లేరన్నారు కదా?
పాత్రికేయుల ప్రశ్నలతో చంద్రబాబు తడబాటు 
ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటక విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. కర్ణాటకలో ప్రచారం అనంతరం శ్రీరామనగర్‌ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు వేసిన ప్రశ్నలకు చంద్రబాబు తడబడ్డారు. 

ఏం అడిగారు, ఏం చెప్పారు  
- మీరు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అన్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అన్ని రాష్ట్రాల కంటే మంచి ప్యాకేజీ ఇస్తామని అది కూడా ఇవ్వలేదన్నారు. గత ఎన్నికలలో నరేంద్ర మోదీ కంటే గొప్ప నాయకుడు లేడు అని ప్రచారం చేశారు కదా అని విలేకరులు ప్రశ్నించారు. నేను నమ్మి మోసపోయాను అని బదులిచ్చారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి అన్న ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఈవీఎంలపై తనకు అనుమానాలు ఉన్నాయి అని దాటవేశారు. 
-  దేశ ప్రధానిగా రాహుల్‌గాంధీ సరైన అభ్యర్థి కాదు అని కొందరు అంటున్నారు, దానికి మీ సమాధానం ఏమిటి? అని విలేకరులు అడగ్గా, నరేంద్ర మోదీ ఏమైనా సరైన నాయకుడా అని ఎదురు ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement