సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ మంత్రులు రాజీనామా చేసినా.. ఎన్డీయేలో కొనసాగడం మోసపూరితం కాదా అని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదా అని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. పార్థసారధి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘చంద్రబాబు మంత్రులు రాజీనామా చేస్తారట. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతారంట. ఇంతకన్న మోసం ఎవరైనా చేస్తారా అంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు ఉండి ప్రత్యేక హోదా సంజీవని కాదు, ముగిసిపోయిన అధ్యాయం, జగన్ రాజకీయాలు చేస్తున్నారని రకరకాల భాష్యాలు చెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూటర్న్‌తీసుకున్నారని అందరు భావించారు. అయితే ఆయన ఎన్‌డీఏ కూటమిలో కొనసాగడం, అవిశ్వాస తీర్మానం పెడితే ఏం వస్తుందని అంటున్నారంటే చంద్రబాబు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ అని అభివర్ణించారు.
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటున్నారని గుర్తు చేశారు. మొన్నటి వరకు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ మన అభివృద్ధిని చెప్పమని చంద్రబాబు తన ఎంపీలకు చెబుతున్నారన్నారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. అమరావతిలో ఒక్కటైన పర్మినెంట్ పని చేశావా అని నిలదీశారు. రాజధాని కోసం వేలాది మంది రైతులు త్యాగం చేస్తే.. ఆ త్యాగాన్ని కూడా చంద్రబాబు క్యాష్ చేసుకుంటున్నారని మండిపడ్డారు.
29సార్లు ఢిల్లీ వెళ్లామని, అందర్ని కలిశానని గొప్పగా చెబుతున్నారని, అన్నిసార్లు వారితో కలిస్తే వారి ఆలోచన ఏంటో తెలియలేదా అని పార్ధసారధి ధ్వజమెత్తారు. అసలు నీకు పరిపాలన దక్షత ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ మాదిరిగానే మీరు కూడా ఆలోచిస్తున్నారని విమర్శించారు. 29సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అసెంబ్లీ సీట్లు పెంచండి, కమీషన్లకు అడ్డుపడకుండా, అంచనాలు పెంచండి, వైఎస్‌ఆర్‌సీపీని అణచమని కేంద్ర మంత్రులనున కోరినట్లు వారే చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు చేశారని, ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారని పార్థసారధి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ చేసే పోరాటాలకు అండగా ఉంటావా? ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment