pardha sarathi
-
ఉక్రెయిన్‌కి విత్తన ఎగుమతి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తికి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ బృందంతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో మంచి వాతావరణ పరిస్థితులు, నేలలు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయని ఉక్రెయిన్ బృందానికి తెలిపారు. ఈజిప్ట్, మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్ ఇప్పటికే తెలంగాణ నుంచి విత్తనాల దిగుమతికి సుముఖత తెలిపినట్లు వివరించారు. ఉక్రెయిన్ దేశంకి కూడా అంతర్జాతీయ (ఓఈసీడీ) ధ్రువీకరణ ద్వారా విత్తనాలు ఎగుమతి చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌లో గోధుమలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, చిక్కుడు ప్రధాన పంటలనీ, ఏడాదిలో ఒకే సీజన్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఫ్రాన్స్ నుంచి పొద్దుతిరుగుడు దిగుమతి చేసుకుంటున్నామని, భవిష్యత్తులో తెలంగాణ నుంచి∙500 టన్నుల హైబ్రీడ్ పొద్దు తిరుగుడు దిగుమతి చేసుకుంటామన్నారు. సమావేశంలో ఉక్రెయిన్ విత్తన ప్రతినిధులు విటలి ప్లొట్కా, సెర్జీ షెవెన్‌చ్కో, తెలంగాణ విత్తన ధ్రువీకరణ అథారిటికి చెందిన భాస్కర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ జి.సుదర్శన్ పాల్గొన్నారు. -
గొంతు నొక్కేందుకే పోలీసులను ప్రయోగించారు
-
బాబు తమ మిత్రుడే అని రాజ్‌నాథ్ చెప్పలేదా?
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ, బీజేపీకి సహకరిస్తోందని తప్పుడు ఆరోపణలు చేశారని.. పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు నాయుడు తమ మిత్రుడేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పలేదా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి ప్రశ్నించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను చంద్రబాబు ఖండించారా అని సూటిగా అడిగారు. కేంద్రంలో ఎన్డీయేపై పోరాటాన్ని ప్రకటించిన పార్టీ వైఎస్సార్సీపీ అని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తాము పోరాడామని..ఇంకా పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. హోదాపై మాట్లాడిన ప్రతి ఒక్కరినీ పోలీసులతో అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అవిశ్వాసం వల్ల చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ సొంత ఎజెండాపైనే మాట్లాడారని విమర్శించారు. అటు ప్రధాని, ఇటు రాహుల్ గాంధీ ఏపీ ప్రయోజనాలపై దాటవేసే ధోరణి చూపారని అన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసింది..ప్రధాని ప్రసంగం తర్వాత క్లారిఫికేషన్‌పై మాట్లాడే అవకాశాన్ని టీడీపీ ఎంపీలు వృధా చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఒప్పుకున్న తర్వాతే ప్యాకేజీ ప్రకటించామని ప్రధాని మోదీ చెప్పారు..దీనికి సమాధానం చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. అవిశ్వాసంపై చర్చ తర్వాత ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పాలి..ప్రధాని మాటలను ఎక్కడా ఖండించలేదు కాబట్టి..ప్యాకేజీకి తాను ఒప్పుకున్న విషయం వాస్తవమేనని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లు తెలుస్తోందన్నారు. -
‘పవన్ కల్యాణ్ ఎందుకు తోక ముడిచాడు’
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్థసారధి బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్ఆర్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. నాలుగేళ్లు టీడీపీ భాగస్వామిగా వున్న పవన్‌కు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఎలా కనబడుతుంది. అవిశ్వాసం పెట్టే దమ్ముందా అని పవన్ చేసిన సవాల్‌ను మా పార్టీ స్వీకరించింది. అంతేకాదు మా ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ నెల 6న రాజీనామాల అనంతరం ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షం బాధ్యతతో చేస్తున్న ఉద్యమంగా పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా? ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడే టీడీపీతో మా పార్టీని ఎలా పోల్చుతారు?. ఆరు నెలలకు ఓసారి బైటకి వచ్చే పవన్‌కు రాష్ట్ర ప్రయోజనాల మీద ఏమేరకు చిత్తశుద్ధి వుంది?. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కలిసి వచ్చే ప్రతి ఉద్యమ సంస్థకు మా మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ గతంలోనే ప్రకటించారు. స్వయంగా వైఎస్సార్సీపీ యువభేరీలు, రహదారుల దిగ్బంధం, ఢిల్లీలో ధర్నాలు నిర్వహించింది. హోదా కోసం పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఏం చేశారు?. కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి. నేను కూడా ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీలను అవిశ్వాసం వైపు సహకారం కోరతాను అని పవన్ అన్నారు. మరి ఢిల్లీకి వెళ్లకుండా ఎందుకు ఉదాసీనంగా వున్నారో చెప్పాలి. తన పార్టనర్ టీడీపీని కాపాడేందుకు మళ్లీ యత్నిస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడుతానన్న పవన్ ఢిల్లీ వెళ్లకుండా పారిపోయారు.’ అని పార్థసారధి ఎద్దేవా చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రానికి అమ్మేశారా..!!
సాక్షి, విజయవాడ: రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారధి విమర్శించారు. ప్రజా సంకల్పం వల్లే జాతీయ రహదారుల దిగ్భందం విజయవంతం అయ్యిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్థసారధి, పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌లు మాట్లాడారు. 2016లో కేంద్రం, హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే స్వాగతించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పార్థసారధి ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో ఎన్నడూ హోదా కోసం పనిచేయని ఆయనకు వైఎస్సార్ సీపీని విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని వారి రాజకీయ భాగస్వామి పవన్ కల్యాణ్ ఎండగట్టడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ మీద యుద్ధం..ఆంధ్రుల ఆత్మ గౌరవం’ వంటి భారీ డైలాగులతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కోల్పోతున్నారని చురకలంటించారు. కాగ్ పెట్టిన వాతలు.. పోలవరం నిర్మాణం పూర్తయితే పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని కాగ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు. కానీ పట్టిసీమ డీపీఆర్ (డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లో దాని జీవిత కాలం 20 ఏళ్లు అని పేర్కొన్నారని టీడీపీపై ధ్వజమెత్తారు. పట్టిసీమ కాంట్రాక్టర్‌కు 22 శాతం అదనంగా చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాపద్దుల కమిటీ కూడా బయటపెట్టిందనీ.. అందుకనే ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు. ఈ కమిటీలో వైఎస్సార్ సీపీ ఒక్కటే లేదని ఇతర అన్ని పార్టీల సభ్యులు ఉన్నారని అన్నారు. ఒకపైపు దేశం పురోగమిస్తుంటే.. చంద్రబాబు విదేశీ సాంకేతికత, జపాన్ తరహా పోరాటం అనడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి ప్రశ్నిస్తారనే భయంతో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలను చూసి టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
అవినీతిని బయటపెట్టిన పవన్‌కు ఏం సమాధానం ఇస్తారు?
-
పవన్‌కు ఏం సమాధానం చెబుతారు?
సాక్షి, విజయవాడ : అవిశ్వాసం విషయంలో చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. పార్లమెంట్ నిబంధనలు తెలిసినవారికి ఎవరికైనా చంద్రబాబు విన్యాసాలు అర్థమవుతాయని అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు వారివారి కారణాల వల్ల అవిశ్వాసంకు మద్దతు ఇస్తున్నాయి. దీనికి తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. మీరే స్వచ్ఛమైన పాలన ఇచ్చేవారయితే..ఎందుకు నిత్యం వామపక్షాలు రాష్ట్రంలో మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. కేంద్రంపై వ్యతిరేకత కారణంగా వామపక్షాలు అవిశ్వాసంకు మద్దతు ఇస్తున్నాయి. గతంలో కేంద్రంపై బీజేపీ, కమ్యూనిస్ట్‌లు కలిపి అవిశ్వాసం పెట్టాయి. నాలుగేళ్లు కలిసి వున్న మీ భాగస్వామి పవన్ కల్యాణ్ మీ అవినీతిని బయటపెట్టారు. పవన్‌కు మీరు ఏం సమాధానం చెబుతారు?. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై పశ్చాత్తాపం వుంటే...ఇప్పటివరకూ ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి వైఎస్ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్ జగన్‌పై వున్న కేసులను ప్రస్తావిస్తున్నారు. న్యాయవ్యవస్థపై చంద్రబాబుకు నమ్మదకం, గౌరవం లేన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కేంద్రంతో అనుకూలంగానో...ప్రతికూలంగానో వుంటే కేసులు కొట్టేస్తారని ఎలా చెబుతున్నారు?. రాజకీయాల్లో సీనియర్‌గా చెప్పుకునే బాబుకు న్యాయవ్యవస్థపై ఏమాత్రం అవగాహన వుందో అర్థం అవుతుంది. ఇసుక, మట్టి, పోలవరం ఇలా మీరు చేసిన ప్రతి అవినీతిని వచ్చే ఎన్నికల్లో ఎండగడతాం.’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. -
వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ మంత్రులు రాజీనామా చేసినా.. ఎన్డీయేలో కొనసాగడం మోసపూరితం కాదా అని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదా అని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. పార్థసారధి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు మంత్రులు రాజీనామా చేస్తారట. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతారంట. ఇంతకన్న మోసం ఎవరైనా చేస్తారా అంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు ఉండి ప్రత్యేక హోదా సంజీవని కాదు, ముగిసిపోయిన అధ్యాయం, జగన్ రాజకీయాలు చేస్తున్నారని రకరకాల భాష్యాలు చెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూటర్న్‌తీసుకున్నారని అందరు భావించారు. అయితే ఆయన ఎన్డీఏ కూటమిలో కొనసాగడం, అవిశ్వాస తీర్మానం పెడితే ఏం వస్తుందని అంటున్నారంటే చంద్రబాబు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ అని అభివర్ణించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటున్నారని గుర్తు చేశారు. మొన్నటి వరకు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ మన అభివృద్ధిని చెప్పమని చంద్రబాబు తన ఎంపీలకు చెబుతున్నారన్నారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. అమరావతిలో ఒక్కటైన పర్మినెంట్ పని చేశావా అని నిలదీశారు. రాజధాని కోసం వేలాది మంది రైతులు త్యాగం చేస్తే.. ఆ త్యాగాన్ని కూడా చంద్రబాబు క్యాష్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. 29సార్లు ఢిల్లీ వెళ్లామని, అందర్ని కలిశానని గొప్పగా చెబుతున్నారని, అన్నిసార్లు వారితో కలిస్తే వారి ఆలోచన ఏంటో తెలియలేదా అని పార్ధసారధి ధ్వజమెత్తారు. అసలు నీకు పరిపాలన దక్షత ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ మాదిరిగానే మీరు కూడా ఆలోచిస్తున్నారని విమర్శించారు. 29సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అసెంబ్లీ సీట్లు పెంచండి, కమీషన్లకు అడ్డుపడకుండా, అంచనాలు పెంచండి, వైఎస్ఆర్సీపీని అణచమని కేంద్ర మంత్రులనున కోరినట్లు వారే చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు చేశారని, ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారని పార్థసారధి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ చేసే పోరాటాలకు అండగా ఉంటావా? ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘దమ్ముంటే జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి’
సాక్షి, విజయవాడ : యువభేరిపై ఏపీ మంత్రులు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఉన్న అవగాహన కూడా మంత్రులకు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. యువత కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే టీడీపీ భయపడుతోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దమ్ముంటే వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రంతో లాలూచిపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అయితే ఇప్పటివరకూ ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా అనంతపురంలో ఇవాళ వైఎస్ జగన్ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
పోలవరం ప్రాధాన్యత ఇప్పుడు గుర్తొచ్చిందా?
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....‘చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేకపోయారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో కుమ్మక్కై పోలవరాన్ని ఆపేందుకు యత్నించింది నిజం కాదా?. పోలవరం కాల్వల తవ్వకంపై రైతులతో కోర్టుల్లో కేసులు వేయించింది వాస్తవం కాదా?. పోలవరంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీని ఎందుకు పొందలేకపోయారు. చంద్రబాబుపై కేంద్రానికి అనుమానాలు ఉండటం వల్లే ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు బంగారు గుడ్లు పెట్టే బాతులా చూస్తున్నారు. పోలవరం జాప్యానికి ముఖ్యమంత్రిదే బాధ్యత.’ అని మండిపడ్డారు. -
ఒక్క ఇటుక అయినా అక్కడ పెట్టారా?
-
యనమలవి స్థాయికి మించిన విమర్శలు
విజయవాడ: ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన స్థాయిని మించి విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్‌పై విమర్శలు చేసినవారికే ఫస్ట్ ర్యాంకులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడకు రిటైర్డ్మెంట్ మూడ్ వచ్చేసినట్లు ఉందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ఫిరాయింపు రాజకీయాలకు నిరసనగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి సేవ్ డెమెక్రసీ పేరుతో జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయనున్నట్లు వివరించారు.