సాక్షి, విజయవాడ : అవిశ్వాసం విషయంలో చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. పార్లమెంట్ నిబంధనలు తెలిసినవారికి ఎవరికైనా చంద్రబాబు విన్యాసాలు అర్థమవుతాయని అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు వారివారి కారణాల వల్ల అవిశ్వాసంకు మద్దతు ఇస్తున్నాయి. దీనికి తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. మీరే స్వచ్ఛమైన పాలన ఇచ్చేవారయితే..ఎందుకు నిత్యం వామపక్షాలు రాష్ట్రంలో మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. కేంద్రంపై వ్యతిరేకత కారణంగా వామపక్షాలు అవిశ్వాసంకు మద్దతు ఇస్తున్నాయి. గతంలో కేంద్రంపై బీజేపీ, కమ్యూనిస్ట్‌లు కలిపి అవిశ్వాసం పెట్టాయి.
నాలుగేళ్లు కలిసి వున్న మీ భాగస్వామి పవన్ కల్యాణ్ మీ అవినీతిని బయటపెట్టారు. పవన్‌కు మీరు ఏం సమాధానం చెబుతారు?. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై పశ్చాత్తాపం వుంటే...ఇప్పటివరకూ ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి వైఎస్ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్ జగన్‌పై వున్న కేసులను ప్రస్తావిస్తున్నారు. న్యాయవ్యవస్థపై చంద్రబాబుకు నమ్మదకం, గౌరవం లేన్నట్లుగా ఆయన వ్యాఖ‍్యలు ఉన్నాయి. కేంద్రంతో అనుకూలంగానో...ప్రతికూలంగానో వుంటే కేసులు కొట్టేస్తారని ఎలా చెబుతున్నారు?. రాజకీయాల్లో సీనియర్‌గా చెప్పుకునే బాబుకు న్యాయవ‍్యవస్థపై ఏమాత్రం అవగాహన వుందో అర్థం అవుతుంది. ఇసుక, మట్టి, పోలవరం ఇలా మీరు చేసిన ప్రతి అవినీతిని వచ్చే ఎన్నికల్లో ఎండగడతాం.’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment