సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళడంతో.. ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపింది. నాలుగేళ్లపాటు పెన్షన్ల అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రభావంతో పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆకస్మాత్తుగా పింఛన్ల పెంపు ప్రకటన చేశారు.
వృద్దులకు 2వేలు, వికలాంగులకు 3 వేల రూపాయల పింఛన్ అందజేస్తామని నవరత్నాల్లో వైఎస్ జగన్ పేర్కొనడంతో పాటు ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంతకాలం వైఎస్ జగన్ హామీపై విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు అదే హామీని అమలు చేయడానికి సన్నద్ధమయ్యారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఫించన్ల పెంపు నిర్ణయం డ్రామాలో భాగంగానే పలువురు అభివర్ణిస్తున్నారు. వైఎస్ జగన్ హామీ వల్లనే చంద్రబాబు ఎన్నికలకు ముందు పింఛన్ రెట్టింపు అంటు ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment