వాహనం పైనుంచి కిందకు దిగేందుకు చంద్రబాబునాయుడు అవస్థలు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల ప్రచారం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. జనాలు లేక అసహనానికి గురైన ఆయన... ఒకచోట ప్రసంగించకుండానే ముందుకెళ్లారు.. మరో సర్కిల్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. చేసేది లేక ఉన్న జనాలనుద్దేశించి గంటసేపు ప్రసంగించిన చంద్రబాబు ఆధ్యంతం ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలే చేశారు. జనాలు లేక సీఎం ‘అనంత’ పర్యటన ఫ్లాప్ కావడంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు జేసీ పవన్ కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరిలు పూర్తిగా డీలాపడ్డారు.
అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు నాలుగు చోట్ల ప్రసంగించాల్సి ఉంది. మధ్యాహ్నం గుత్తి బహిరంగసభలో మాట్లాడి, అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్‌లో మడకశిరకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడి అనంతపురంలోని శిల్పారామానికి చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం 6 గంటలకు పాతూరులోని గాంధీసర్కిల్‌లో రోడ్‌షో ప్రారంభించాలి. అక్కడ చంద్రబాబు ప్రసంగించాలి. అయితే జనాలు లేకపోవడంతో శిల్పారామం వద్ద బస్సులోనే గంటపాటు గడిపారు. 7.20కి పాతూరుకి వచ్చారు. జనాలు లేకపోవడంతో అసహనంతో ప్రసంగించ కుండా... అభివాదం చేసి ముందుకు కదిలారు. మాట్లాడాలని ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మైకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు తిరస్కరించారు. అక్కడి నుండి గాంధీబజారు మీదుగా సప్తగిరి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో ఉన్న జనాలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించిన పది నిమిషాలకే మహిళలు మొత్తం వెనుదిరిగారు. వచ్చిన కొద్దిమందినుద్దేశించి గంటకుపైగా చంద్రబాబు ప్రసంగించడం విశేషం.
రూ. 250 కూలీ అని కాళ్లు విరగ్గొట్టుకున్నారా?
చంద్రబాబు సభకు గంటసేపు పోయివస్తే రూ.250 ఇస్తారని మహిళలు వచ్చారు. సప్తగిరి సర్కిల్‌లో మసీదు సమీపంలో నిల్చున్నారు. పైగా భాగంలో మిద్దెపై యువకులు ఎక్కడంతో గోడ కూలిపోయి కిందపడ్డారు. రాళ్లు విరిగిపడి మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు రూ.24మంది గాయపడ్డారు. వీరితో కాళ్లు విరిగినవారు, తలలు పగిలినవారు ఉన్నారు. వీరి కుటుంబసభ్యులు, పక్కన ఉన్న మహిళలు ‘రూ.250కి ఆశపడి వస్తే ప్రాణాలు పోతుండే!’ అని బోరున విలపించారు.
గతంలో ఇచ్చిన హామీలే మళ్లీ వల్లెవేసిన చంద్రబాబు
గత ఎన్నికల సమయంలో అనంతపురానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రింగ్‌రోడ్డు నిర్మిస్తామన్నారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అయితే మరో అడుగు ముందుకేసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో నామినేషన్ వేయనని 2014 ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఐదేళ్ల తర్వాత తిరిగి ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు వచ్చారు. తిరిగే అవే హామీలు వల్లె వేశారు. మళ్లీ అధికారం ఇస్తే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. దీంతో అనంత అభివృద్ధిపై చంద్రబాబు ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టమవుతోందని అంతా చర్చించుకున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు మైకు ఇవ్వని బాబు
రోడ్‌షోలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రభాకర్‌చౌదరి, జేసీ పవన్ కుమార్‌రెడ్డి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. గంటపాటు ఆయనే ప్రసంగించి, చివరల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇది కూడా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘మీకు పౌరుషం లేదా? రోషం లేదా? అనంతపురం పౌరుషం మీలో ఉందా? ఉంటే తెలుగుదేశంపార్టీని గెలిపించండని మాట్లాడారు.
‘అనంత’లోనే బస
రోడ్‌షో అనంతరం చంద్రబాబు శిల్పారామానికి వెళ్లి అక్కడే బస్సులో బస చేశారు. జిల్లాలోని టీడీపీ నేతలను పిలిపించుకుని ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
నేడు పుట్టపర్తికి చంద్రబాబు
అనంతపురం టౌన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గురువారం పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అనంతపురం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పుట్టపర్తికి వెళ్తారు. అక్కడ సభ ముగించుకొని విజయవాడ వెళ్లనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment