సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలను దగ్గరుండి మరీ నాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడేనని నంబర్ వన్ విలన్ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసినా.. నేడు బీజేపీ అన్యాయం చేస్తున్నా.. దీనికి కారణం చంద్రబాబేనని, అప్పుడు లేఖ రాసి రాష్ట్ర విభజనకు సహకరించారని, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాడని ఆయన విమర్శించారు. విజయవాడలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోనే సీనియర్ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు విశ్వసనీయతలో అథముడని ప్రత్యేక హోదా విషయంలో స్పష్టంగా అర్థమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకునేది ఒక్క చంద్రబాబేనని పార్థసారధి విమర్శించారు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని ఇన్నాళ్లు మభ్యపెట్టారని, ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. రాజధానిని రియల్ ఎస్టేట్‌గా మార్చి భూములు దోచుకున్నారని, తన స్వార్థం, కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ పనులు చేజిక్కించుకున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు.
అఖిల సంఘం పేరుతో కొత్త డ్రామాలు ఎందుకు? హోదా కంటే ప్యాకేజీ మేలు అని చెప్పినప్పుడు అఖిలపక్షం గుర్తుకురాలేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ బావుంది అని అర్థరాత్రి మీడియాకి చెప్పే సమయంలో అఖిలపక్షం గుర్తుకు రాలేదా అని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రా లేక టీడీపీ సీఈవోనా అని ప్రశ్నలు సంధించారు. పవన్ కల్యాణ్ పేరుతో చంద్రబాబు మళ్లీ డ్రామాలు చేస్తున్నారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేరని.. అబద్ధాలు, మోసాలు, మాటలు మారుస్తున్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment