అభివృద్ధికి నోచుకోని రత్నగిరి కొండ
సాక్షి,మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి బుధవారం మడకశిరకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా 2016 డిసెంబర్ 2వ తేదీ మడకశిరకు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చారు. కానీ వాటిని ఇంతవరకూ నెరవేర్చలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఆయన పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మడకశిర ప్రాంతంలో ఓట్లడిగే అర్హత లేదంటున్నారు.
హంద్రీ – నీవా కాలువ: మడకశిర నియోజకవర్గానికి హంద్రీ – నీవా పథకం ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంద్రీ – నీవా ద్వారా సాగునీరు అందిస్తామని హడావుడి చేసిన స్థానిక టీడీపీ నాయకులు చివరకు చేతులెత్తేశారు.
పారిశ్రామిక వాడ: మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 1,600 ఎకరాలు సేకరించారు. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదు. భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం కూడా అందించలేదు. దీంతో రైతులు, నిరుద్యోగులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ: మడకశిరలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తానని, అందుకోసం నిధులు పెద్దఎత్తున అందిస్తానని ప్రకటించారు. ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు.
కార్యరూపం దాల్చని రింగ్ రోడ్డు: మడకశిరలో రింగ్‌రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.45 కోట్ల నిధులను మంజూరు చేశామని చెప్పారు. అయితే ఇప్పటికీ రింగ్ రోడ్డు పూర్తి కాకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఏర్పాటు కాని డిగ్రీ కళాశాలలు: అమరాపురం, గుడిబండలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ చేయలేదు. దీంతో ఈ రెండు మండలాల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతున్నారు.
100 పడకల ఆస్పత్రి: మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి 50 పడకలైతే 100 పడకలకు పెంచుతామని చెప్పారు. నిన్నమొన్నటి వరకూ పట్టించుకోకుండా నెలరోజుల క్రితం 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ జీఓ జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోలేదు.
పర్యాటక కేంద్రాలు: నియోజకవర్గంలోని రత్నగిరి, హేమావతి, భక్తరహళ్లి, జిల్లేడుగుంటలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. కానీ వాటి గురించి పట్టించుకోలేదు.
రాళ్లపల్లి రిజర్వాయర్: గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద హంద్రీ – నీవా రిజర్వాయర్ నిర్మించి నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ నింపుతామన్నారు. ఇంతవరకూ అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హామీలు నెరవేర్చి మడకశిరకు రావాలి
2016లో చంద్రబాబు మడకశిరకు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఇంతవరకూ అవి నెరవేరలేదు. వాటిని నెరవేర్చిన తర్వాతే ఆయన మళ్లీ మడకశిరకు రావాలి. హామీలను నెరవేర్చని సీఎంను మడకశిర ప్రజలు నిలదీయాలి.
– లక్ష్మీనారాయణ, హరేసముద్రం, మడకశిర
చంద్రబాబు మోసం చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మడకశిర ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా పారిశ్రామికవాడ ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులను ముంచేశారు. మళ్లీ మడకశిరకు వచ్చి ఓట్లు అడిగే అర్హతను కోల్పోయారు.
– మంజునాథ్, జిల్లేడుగుంట, మడకశిర
Comments
Please login to add a commentAdd a comment