
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం వల్లే తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ పార్టీపై సీపీఐ చేసిన దాడిని హరిబాబు ఖండించారు. బీజేపీపై జరిగిన దాడి అప్రజాస్వామికమని, కమ్యూనిస్ట్‌ల ఫాసిస్ట్ ఆలోచనలకు నిదర్శనమన్నారు. ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ కార్యక్రమంపై దాడి చేయడం విశాఖలో కొత్త విధానం, సంస్కృతిగా మారిందన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీపై చేసిన దాడులకు మద్దతు ఉందని ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మద్దతు కమ్యూనిస్టులకు నైతిక బలమిచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని పేర్కొన్నారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏ నిర్వీర్యమైన ప్రభుత్వముందో, రాబోయే రోజుల్లోనూ అలాంటి నిర్వీర్యమైన ప్రభుత్వమే వస్తుందన్నారు.