
సాక్షి, అమరావతి: చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానంతో ఈసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపీఠం ఎక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ, సర్వేల్లో వెనుకబడ్డారంటూ రకరకాల సాకులతో వారికి మొండి చేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేనంటూ తెగేసిచెప్పేశారు. 21 మందిలో కేవలం ఐదారుగురికి మాత్రమే మళ్లీ పోటీ చేసే అవకాశమివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. వారిలో భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు మృతి చెందగా.. మిగిలిన 21 మంది టీడీపీలో కొనసాగుతున్నారు. వారిలో నలుగురికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు వారందరి పరిస్థితి తలకిందులైంది.
ఆదిని సైడ్ చేశారు.. సుజయకృష్ణను పక్కనపెట్టారు
నలుగురు మంత్రుల్లో ఇద్దరికి మళ్లీ సీటు దొరకడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు మళ్లీ జమ్మలమడుగు సీటివ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా వైఎస్సార్‌సీపీకి కంచుకోట అయిన కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో తనను బలిపశువును చేస్తున్నారంటూ ఆదినారాయణరెడ్డి తన అనుచరుల వద్ద వాపోతున్నారు. చివరకు తన చేతిలో ఓడిపోయిన రామసుబ్బారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన బావురమంటున్నట్లు తెలిసింది. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మరో మంత్రి సుజయకృష్ణ రంగారావును అవినీతి ఆరోపణల కింద పక్కనపెట్టేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంలోనే మరొకరిని రంగంలోకి దించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
తలకిందులైన రాజకీయ భవితవ్యం..
పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ, పాడేరు–గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం– వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ– జలీల్‌ఖాన్, యర్రగొండపాలెం– డేవిడ్‌రాజు, శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోడుమూరు– మణిగాంధీ, కదిరి– చాంద్ బాషా, బద్వేలు– జయరాములు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు మళ్లీ సీట్లు దక్కే అవకాశం దాదాపు లేనట్లేనని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. కలమట వెంకట రమణ స్థానంలో పక్క జిల్లా నుంచి వేరే ఎవరినైనా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు.
ఇక గిడ్డి ఈశ్వరి స్థానంలో మాజీ మంత్రి మణికుమారి, బొర్రా నాగరాజుల పేర్లను పరిశీలిస్తున్నారు. వంతల రాజేశ్వరి బదులు చిన్నం బాబూరావు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు.. వరుపుల సుబ్బారావు స్థానంలో ఆయన కుటుంబంలోని మరొకరికి, జలీల్‌ఖాన్ స్థానంలో ఆయన కుమార్తెకు సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి సీటు ఖరారు చేయకుండా ఏకంగా ఏరాసు ప్రతాప్‌రెడ్డిని రేసులోకి తీసుకొచ్చారు. మణిగాంధీకి సీటు లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. ఆ స్థానానికి సమర్థుడిని తీసుకురావాలని జిల్లా నేతలకు సూచించడం గమనార్హం. చాంద్‌బాషా స్థానంలో ఆయన చేతిలో ఓడిపోయిన కందిగుంట ప్రసాద్, ఉప్పులేటి కల్పన స్థానంలో డీవై దాసు, వర్ల రామయ్య పేర్లను పరిశీలిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కూడా సీటు ఖరారు చేయలేదు. దీంతో వీరందరి రాజకీయ భవితవ్యం పూర్తిగా తలకిందులైనట్లయ్యింది.
యూజ్ అండ్ త్రోలో బాబు దిట్ట..
తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడంలో.. పని పూర్తయ్యాక వారిని పక్కనపడేయడంలో చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పలు ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు ఏకంగా ఆయన కుమారుడు, తన బావమరిది నందమూరి హరికృష్ణను చంద్రబాబు ఉపయోగించుకోవడం.. ఆ తర్వాత అవమానాలకు గురిచేయడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అంతెందుకు ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం హరికృష్ణ కుమార్తె సుహాసినిని.. ఓడిపోతామని తెలిసి కూడా రంగంలోకి దించి బలిపశువును చేశారనే ఆవేదన టీడీపీ నాయకుల్లోనే వ్యక్తమైంది. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ వంటి ఎందరో నాయకులు బాబు ‘యూజ్ అండ్ త్రో’ విధానానికి బలైనవారే. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన మెజారిటీ ఎమ్మెల్యేలు బాబు చక్రబంధంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.
ప్రజల్లో వ్యతిరేకత.. పార్టీలో అవమానం
వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో వీరందరికీ రూ.30 కోట్లకు పైగా డబ్బులివ్వడంతో పాటు కాంట్రాక్టులు ఇస్తామని, కుదిరితే మంత్రి పదవి లేకపోతే ఇతర పదవులు ఇస్తామని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మళ్లీ పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తామని ఆ సమయంలో చంద్రబాబు వీరికి హామీ ఇచ్చారు. ఈ విషయాలను మణి గాంధీ, గిడ్డి ఈశ్వరి వంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదని తెలిసి కూడా.. చంద్రబాబు 175 ఎమ్మెల్యేల స్థానాలు 225కి పెరుగుతాయని, కొత్తవారు పార్టీలోకి వచ్చినా ఇబ్బందేమీ ఉండదంటూ మభ్యపెట్టారు. తీరా పార్టీ ఫిరాయించిన తర్వాతి నుంచి సర్వేల్లో వెనుకబడుతున్నారంటూ వారిని వ్యూహాత్మకంగా అవమానిస్తూ వచ్చారు. ఎన్నికలు వచ్చే సరికి ఇప్పుడు వారిలో అత్యధిక మందిని పక్కనబెట్టేశారు. చంద్రబాబును నమ్మి పూర్తిగా మోసపోయామని.. తమను ఆయన కరివేపాకుల్లా పక్కనపడేశారంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద బావురమంటున్నారు. చంద్రబాబు వల్ల ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నామని.. అయినా కూడా సీట్లివ్వకుండా దగా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి రెంటికిచెడ్డ రేవడిలా తయారైందని నెత్తీనోరు బాదుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment