చంద్రబాబు రాగం, తాళం, పల్లవి.. అందుకే : వైఎస్‌ జగన్‌ | Chandrababu Showing New Movie For Elections Says YS Jagan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాగం, తాళం, పల్లవి.. అందుకే : వైఎస్‌ జగన్‌

Published Tue, Jun 26 2018 7:10 PM | Last Updated on Thu, Jul 26 2018 7:17 PM

Chandrababu Showing New Movie For Elections Says YS Jagan - Sakshi

సాక్షి, అమలాపురం (తూర్పు గోదావరి) : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు, నాలుగు నెలల తర్వాత’ అనే సినిమాను ప్రజలకు చూపిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దుయ్యబట్టారు. 199వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ మధ్య చంద్రబాబుకు హాస్టల్‌లో చదువుకుంటున్న పిల్లలపై, నిరుద్యోగులపై, అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉన్నట్లువుండి ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు.

హాస్టల్‌లో చదువుకుంటున్న పిల్లలకు కోడికూర పెడతానని చంద్రాబాబు అంటున్నారని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 648 ఎస్సీ హాస్టళ్లు, 201 బీసీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లను చంద్రబాబు  మూసేశారు. దీంతో 60 వేల మంది పిల్లలు రోడ్డున పడ్డారు. స్కూళ్లు ప్రారంభమైనా ఇప్పటివరకూ పిల్లలకు పుస్తకాలు ఇవ్వకపోవడానికి కారణం మన పిల్లలందరూ నారాయణ, చైతన్యలకు వెళ్లడానికేనని అన్నారు. ఇదే అదనుగా వాళ్లేమో మనల్ని బాదుడే బాదుడు బాదాలనేది ప్రధాన ఉద్దేశం అని చెప్పారు.

‘గతంలో అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించారు. లాఠీలతో కొట్టించారు. ఎన్నికలు వస్తున్నాయని ఇదే అంగన్‌వాడీ చెల్లెమ్మలకు జీతాలు పెంచుతా అని చంద్రబాబు చెబుతున్నాడు. నిరుద్యోగులకు భృతి వెయ్యి రూపాయలు ఇస్తానని చెబుతున్నారు. అదీ కేవలం 10 లక్షల మందికేనట. అది కూడా కేవలం నాలుగు నెలలు మాత్రమేనట. ఎన్నికల ముందు చంద్రబాబు రాగం, తాళం, పల్లవి మారుతుంది. ఆయన డ్యాన్స్‌ చేయడం మొదలెడతాడు. అయ్యయ్యో మీకు పింఛన్లు రావడం లేదా?. నాకిప్పుడే తెలిసింది. వెంటనే పది లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తా అంటాడు.

అయ్యో మీకు రేషన్‌ రావడం లేదా? అయితే అధికారి తోలు తీస్తా అంటాడు. ఇల్లు లేదా అయ్యో వెంటనే ఇళ్లు కట్టించి ఇచ్చేస్తా అంటాడు. అయ్యయ్యో మీకు రెండు రూపాయలకు మంచినీరు అందడం లేదా? అయితే, అధికారికి నేను క్లాస్‌ తీసుకుంటా అంటాడు. ‘ఏం చేసినా ఎన్నికలకు ఆరు నెలల ముందు 4 నెలల తర్వాత’ అనే సినిమాను పక్కాగా చూపిస్తాడు. ఈ మధ్యకాలంలో కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ రావడం లేదని చంద్రబాబు ఆదేశాలతో ఆయన పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేస్తున్నారట. ఆశ్చర్యంగా నాలుగేళ్ల పాటు బీజేపీతో కలసివున్నప్పుడు ఫ్యాక్టరీ గుర్తు రాలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఇది కనిపిస్తుంది.

ఇలాంటి నైజం చూసి వేమన పద్యం ఒకటి చెబుతా. ‘ఎలుక తోలు ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా, తిట్టినా ఉలకదు, పలకదు. విశ్వదాభి రామ వినురవేమా‘ అని వేమన అన్నాడు. చంద్రబాబు నైజం గురించి చెప్పాలంటే ఇది సరైన పద్యం. కొనసీమలో గోదారి ఉంటుంది. కానీ, రబీ పంటకు చాలీచాలని నీళ్లు. కోనసీమలో కొబ్బరిచెట్లు ఉంటాయి. కానీ తాగడానికి మంచినీళ్లు ఉండవు. కోనసీమలో పెట్రో సంబంధిత సంపద అపారం. కానీ ప్రజలకు పేదరికం దూరం కాదు. ఉద్యోగాలు దొరకవు. గల్ఫ్‌ బాట పట్టాల్సిందే. కోనసీమలోని మండలానికి హోం మంత్రిగా, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు స్టేషన్‌లో సరిపడా కానిస్టేబుల్స్‌ను పెట్టలేని పరిస్థితి.

వైఎస్సార్‌ పదేళ్ల కిందట రూ. 70 కోట్లతో వైనతేయపై బ్రిడ్డిని కట్టించారు. చంద్రబాబు కనీసం కూనవరం డ్రెయిన్‌ను కూడా బాగు చేయించలేదు. చివరగా కోనసీమలో ఓట్లన్నీ కూడా 2014లో చంద్రబాబు తీసుకున్నారు. ఆ తర్వాత హామీలన్నీ గోదారి, బంగాళాఖాతాల్లో కలిపేశాడు. 2014లో ఇదే జిల్లా నుంచి 19 స్థానాలకు 14 స్థానాలు ప్రజలు ఇచ్చారు. అవి సరిపోలేదని వైఎస్సార్‌ సీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేశాడు చంద్రబాబు. 17 స్థానాలు తీసుకున్న చంద్రబాబు ఈ జిల్లాకు ఏం చేశారు?. అమలాపురానికి ఏం చేశారో చెప్పండి.

స్వామినాథన్‌ కమిటీ సిఫారుసులు అమలు చేస్తానన్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, స్వామినాథన్‌​కమిటీను మర్చిపోయాడు. నాలుగు ఏళ్ల పాటు బీజేపీతో సంసారం చేశారు. కానీ రైతులకు న్యాయం చేయాలని కనీసం ఒక్క లేఖ కూడా రాయడు. భూమి మీద పంటలకే కాక నీళ్లలోని రొయ్యలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. చంద్రబాబు సీఎం అవ్వగానే కొబ్బరి పంట రేటు దారుణంగా పడగొట్టారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ రైతుల నుంచి కొనుగోలు చేసి అమ్ముతోంది. లాభాల కోసం దళారీలకు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి మూడు, నాలుగు రెట్ల అధికంగా అమ్మకాలు చేస్తున్నారు.

ఇదే కోనసీమలో ఖరీఫ్‌లో ముంపు సమస్య, రబీలో సాగునీటికి కొరత. కూనవరం డ్రెయిన్‌ ఆధునీకరణ చేయకపోవడంతో ప్రతి ఏటా 60 వేల ఎకరాల పంట నీట మునుగుతోంది. అమలాపురం టౌన్‌కు తాగునీరు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులో పని చేస్తున్న వారికి ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదు. రెండు రూపాయలకు 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తామన్నారు. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా కూడా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కనిపించదు. చంద్రబాబు పాలనలో తాగడానికి నీళ్లు ఉండవు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది.

ఈ పెద్దమనిషి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నాడు. అక్కడ ఫ్లాట్లు కట్టిస్తాం అని చెబుతున్నాడు. అడుగుకు 2 వేల చొప్పున ఆరు లక్షలతో ఇల్లు కడతారట. బయట బిల్డర్లను అడిగితే ఎంత ఖర్చుఅవుతుందో తెలుస్తుంది. మూడు లక్షలను కేంద్ర, రాష్ట్రం చెల్లిస్తాయట. మిగిలిని మూడు లక్షలను పేదవాడు 20 ఏళ్ల పాటు కడుతూతూతూ పోవాలట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఫ్లాట్లు కట్టించి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇస్తే తీసుకోండి. మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రుణాలను మాఫీ చేసేస్తాం.

ఇసుక ర్యాంపుల్లో హైటెక్‌ పనిముట్లు కనిపిస్తాయి. వేల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. మన కళ్ల ఎదుట దోచుకుంటుంటే, కలెక్టర్‌, పోలీసులు అడ్డుకోరు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, చినబాబు, పెదబాబులకు లంచాలు వెళుతున్నాయి. ఇసుక, మట్టి, మద్యం, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, బొగ్గు, గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు దోచుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే మాఫియాకు పెన్షన్లు, రేషన్‌ కార్డులకు, రేషన్‌ కోసం, మరుగుదొడ్లకు లంచాలు ఇవ్వాల్సివస్తోంది. ఇంతటి దారుణంగా చంద్రబాబు పరిపాలన సాగుతోంది.
 

ఎన్నికల ప్రణాళికను 2014లో చంద్రబాబు విడుదల చేశారు. ఇప్పుడది కనిపించట్లేదు. అది కనిపిస్తే ప్రతి కులం వారు చంద్రబాబు చొక్కా పట్టుకుంటారనే భయం. కాపులు తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని నిలదీస్తే, కాపులు సంఘవిద్రోహ శక్తులు అని ముద్రవేశాడు. కోనసీమలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో కాపులపై కేసులు ఉన్నాయి. వాళ్లు చేసిన తప్పు చంద్రబాబును ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని కోరడమే. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తారని చెప్పిన చంద్రబాబు, వారి ఆ విషయంపై వస్తే ‘తాట తీస్తా’అని అంటాడు. నాయి బ్రహ్మణులు ఎన్నికల మ్యానిఫెస్టోను పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్తే వారికి తోక కత్తిరిస్తానని బెదిరించాడు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే విశ్వసనీయత అనే పదం రావాలంటే వైఎస్‌ జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి.

చంద్రబాబును మీరు పొరబాటున క్షమిస్తే ఏం చేస్తాడో తెలుసా?. మొదటగా మైకు పుచ్చుకుని తాను 2014 ఇచ్చిన హామీలను 98 శాతం పూర్తి చేశానని అంటాడు. మన చెవుల్లో పూలు పెడతాడు. మైకు పట్టుకుని మీరు చిన్నచిన్న అబద్దాలు మోసాలు నమ్మరని తెలిసి ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి మనిషిని పంపుతాడు. ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు పెడతాడు. డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. ఐదు వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసినదే. కానీ ఓటు వేసేప్పుడు మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్దాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలపండి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం వస్తుంది.’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement