సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దయితే తమ పదవులు పోయి రాజకీయంగా ఉనికి కోల్పోతామనే ఆందోళనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల్ని బుజ్జగించేందుకు చంద్రబాబు రెండ్రోజులుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్సీలు పదవులు పోతాయనే భయంతో పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారని తెలియడంతో రంగంలోకి దిగి.. ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలవాలని, వేరే దారి చూసుకోవద్దని, అన్ని రకాలుగా అండదండలు అందిస్తానని పదేపదే ప్రాథేయపడుతున్నట్లు తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే అనుమానం ఉన్న ఎమ్మెల్సీలపై నిఘా పెట్టడంతోపాటు వారితో తరచూ మాట్లాడుతూ.. చేయి దాటిపోకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే అందుబాటులో లేకపోవడంతో వారు ఎక్కడున్నారో తెలుసుకుని.. తన దారికి తెచ్చుకునేందుకు తనకు అత్యంత నమ్మకస్తులైన నేతల్ని చంద్రబాబు రంగంలోకి దింపారు.
నేడు టీడీపీ ఎమ్మెల్సీల శాసనసభాపక్ష భేటీ
పార్టీకి చెందిన ఎమ్మెల్సీల్లో ఎవరు ఏ వైఖరితో ఉన్నారో తెలుసుకునేందుకు ఆదివారం శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలంతా తప్పనిసరిగా ఈ సమావేశానికి రావాలని సమాచారం ఇచ్చారు. జిల్లాల వారీగా మాజీ మంత్రులు, ముఖ్య నాయకులకు వారిని సమావేశానికి తీసుకువచ్చే బాధ్యత అప్పగించారు. వచ్చిన తర్వాత వారందరితో క్యాంపు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ఇప్పటికే క్యాంపు బాధ్యతల్లో తలమునకలై ఉన్నట్లు చెబుతున్నారు.
త్యాగాలు చేయండి.. పదవులు పోయినా ఫర్వాలేదు: చంద్రబాబు
పదవులు పోయినా భయపడాల్సిన అవసరం లేదని, త్యాగాలు చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్సీలకు హితబోధ చేశారు. 1984లో టీడీపీ ధర్మ పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని, ఇప్పుడు ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం పార్టీ ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన మండలి రద్దయినా బాధపడవద్దని కోరారు. ఎమ్మెల్సీ పదవులు పోయినా వాటి ద్వారా వచ్చే జీతభత్యాలు, ఖర్చులన్నీ పార్టీ తరఫున అందే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. పోయిన పదవుల స్థానంలో పార్టీలో గౌరవం ఇస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు.
ఎమ్మెల్సీలకు బాబు బుజ్జగింపులు
Published Sun, Jan 26 2020 3:39 AM | Last Updated on Sun, Jan 26 2020 7:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment